హైదరాబాద్ :తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 18 వ తేదీ నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నగర ప్రజలను కోరారు. అంధత్వంతో ఏ ఒక్కరూ బాధపడొద్దనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. మొదటి విడత లో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో 1.54 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి 50 లక్షల మందికి కంటి అద్దాలు అందజేసినట్లు పేర్కొన్నారు.
రెండో విడత లో జూన్ 30 వ తేదీ వరకు నిర్వహించే కంటి వెలుగుకు హైదరాబాద్ జిల్లా పరిధిలో 115 కంటి పరీక్ష శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కంటి ఆపరేషన్ అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తారని వివరించారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. అవసరాన్ని బట్టి అదనపు శిబిరాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.