హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): పరిపాలనా సౌలభ్యమే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఏర్పాటైన వార్డు కార్యాలయాల సేవలకు పౌ రులు ఫిదా అవుతున్నారు. వార్డు కార్యాలయాల్లో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వం లో పదిమంది సిబ్బంది అందుబాటులోకి ఉండి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారని ప్రజలు హర్షం ప్రకటిస్తున్నారు.
గతంలో సమస్యల పరిష్కారానికి చాలా కాలం పట్టేదని, ఇప్పుడు వార్డు ఆఫీస్ సిబ్బంది సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షిస్తున్నారని కేబీహెచ్బీ కాలనీకి బీఎల్ఎన్ రెడ్డి తెలిపారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనతో పురుడుపోసుకున్న వార్డు పాలనపై ప్రజలకు అవగాహన పెరుగుతున్నదని, ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కారం దొరుకుతున్నదని ఫిర్యాదుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.