హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు, రింగ్‌రోడ్డు కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్‌ను దాఖలు చేసింది. టెరాసాఫ్ట్ కంపెనీకి సైబర్నెట్ కాంట్రాక్ట్ కేటాయింపులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ పిటీ వారెంట్ జారీ చేసింది. ఈ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఇదిలా ఉండగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుపై దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది. రెండురోజుల్లో తుది తీర్పును వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం. చంద్రబాబు తరఫు న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూ థ్రా హైకోర్టు ధర్మాసనం ముందు తమ వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టులో సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది.