చౌటుప్పల్, మార్చి 6 : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల విద్యుత్తు శాఖ ఏడీ గాజుల శ్యామ్‌ప్రసాద్ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. తంగడపల్లిలోని అక్రిట్ పరిశ్రమలో సోలార్ విద్యుత్తు ప్లాంట్‌ను ఓ కాంట్రాక్టర్ ఏర్పాటు చేస్తున్నాడు. సోలార్, సాధారణ విద్యుత్తును కనెక్ట్ చేసిన తర్వాత మీటర్ ఇవ్వడం కోసం ఏడీ శ్యామ్‌ప్రసాద్ రూ.70వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. చౌటుప్పల్‌లోని విద్యుత్తు కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి ఏడీ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లోని ఏడీ ఇంట్లో సైతం సోదాలు నిర్వహించారు.