హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): గల్ఫ్తోపాటు ఇతర దేశాల కార్మికులు, ఎన్నారైల కోసం ఏర్పాటుచేసిన ప్రవాసీ ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని పటిష్టంగా నిర్వహిస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి తెలిపారు. ప్రవాసీ ప్రజావాణి నిర్వహణ మార్గదర్శకాలను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహిస్తున్నామని, ఇందులో విదేశాల్లో ఉన్న బాధితుల పక్షాన వారి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.
వాటిని తదుపరి చర్యల కోసం సంబంధిత శాఖలకు పంపిస్తామని చెప్పారు. తాజా మార్గదర్శకాల ప్రకారం.. గల్ఫ్ తదితర దేశాల నుంచి మృతదేహాలను రాష్ర్టానికి తెప్పించడం, స్వగ్రామానికి అంబులెన్స్ ఏర్పాటు చేయడం, రోగులను స్వదేశానికి రప్పించడం, విదేశీ జైళ్లలో ఉన్నవారికి సహాయం చేసి విడుదలకు కృషి చేయడం, వీసా గడువును మించి అకడే నివసించడం, అత్యవసర పరిస్థితులు, క్షమాభిక్ష, జీతం బకాయిలు ఇప్పించడం తదితరాలను జీఏడీ-ఎన్నారై విభాగం నేరుగా పర్యవేక్షిస్తుంది. ఇది విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అనుసంధానమై పనిచేస్తుంది.