
బీజింగ్, అక్టోబర్ 5: కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందన్న వాదనకు ఒక సైబర్సైక్యూరిటీ సంస్థ పరిశోధన బలం చేకూరుస్తున్నది. కొత్త వైరస్‌ను గుర్తించినట్టు ప్రపంచానికి చైనా తెలియజేసే సమయానికే ఆ దేశంలోని హ్యుబై ప్రావిన్స్‌లో పీసీఆర్ పరీక్ష కిట్ల సేకరణ గణనీయంగా పెరిగినట్టు ఆ పరిశోధనలో వెల్లడైంది. ఆ ప్రావిన్స్‌లోని వుహాన్ నగరంలో కరోనా తొలి కేసులను గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రావిన్స్‌లో వైరస్ నిర్ధారణ పరీక్షలకు వినియోగించే పీసీఆర్ కిట్ల కొనుగోలుపై ఇంటర్నెట్ 2.0 అనే సంస్థ పరిశోధన నిర్వహించింది. కరోనా గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చైనా తెలియజేయడానికి చాలాముందే వుహాన్ ప్రాంతంలో వైరస్ వెలుగుచూసినట్టు తమ పరిశోధన ఫలితాల ద్వారా నిర్ణయానికి వచ్చినట్టు ‘ఇంటర్నెట్ 2.0’ తెలిపింది.
వుహాన్‌లో కొన్ని న్యుమోనియా కేసులను గుర్తించామని, వాటికి కారణం ఇంకా తెలియలేదని చైనాలోని తమ కార్యాలయం 2019 డిసెంబర్ 31న తెలియజేసిందని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించడం తెలిసిందే. 2020 జనవరి 7న చైనా శాస్త్రవేత్తలు కరోనా వైరస్ ఉనికిని గుర్తించారు. అయితే 2019లోనే హ్యుబై ప్రావిన్స్‌లో పీసీఆర్ కిట్ల కొనుగోలు విపరీతంగా పెరిగాయని ఆ నివేదిక వెల్లడించింది. 2018తో పోలిస్తే 2019లో చైనా సంస్థలు రెట్టింపు మొత్తాన్ని పీసీఆర్ కిట్ల కొనుగోలుకు ఖర్చు చేశాయని వివరించింది.