మొయినాబాద్, ఫిబ్రవరి 9: రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగింది. శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. రంగరాజన్ తండ్రి, ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందరరాజన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మొయినాబాద్ పోలీసులు తెలిపారు. సీఐ పవన్‌కుమార్ కథనం ప్రకారం శుక్రవారం రంగరాజన్ ఇంటికి కొందరు వ్యక్తులు వచ్చారు.
రామరాజ్య స్థాపన కోసం తమతో కలిసి పని చేయాలని, సైన్యాన్ని తయారు చేయాలని కోరారు. ఉగాది వరకు సమయం ఇస్తున్నామని, సహకరించకుంటే నిన్ను ఎవరూ కాపాడలేరని హెచ్చరించారు. రంగరాజన్ అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో నిందితులు రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు దర్యాప్తు జరిపామని, ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని ఆదివారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని సీఐ పవన్‌కుమార్ వెల్లడించారు.