వరంగల్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సమాజంలోని మనుషులంతా ఒక్కటేనన్న భావనతో ఉన్నవారే నిజమైన హీరోలని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్‌సత్యార్థి అన్నారు. మతం, కులం, రం గు, పేదరికం వంటి కారణాలతో విభేదించు కోవద్దని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ‘చైల్డ్ ఎడ్యుకేషన్ ఈజ్ బ్లెండ్ ఆఫ్ నేచర్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ’ అనే అంశంపై సోమవారం హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో 50 వేల మంది పాఠశాల విద్యార్థులతో బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కైలాశ్‌సత్యార్థి మాట్లాడుతూ.. పిల్లలు సమిష్టితత్వంతో, విలువలకు ప్రాధాన్యం ఇచ్చే విధం గా ఎదగాలని సూచించారు. చిన్నప్పటినుంచే మానవ విలువలను పెంపొందించే దిశగా ఆలోచించాలని ఉద్బోధించారు. మెరుగైన ప్రపంచం, ఉత్తమ భారత్, అగ్రశ్రేణి తెలంగాణ కోసం కలగనాలని పిలుపునిచ్చారు. సినిమాల్లో హీరోయిజం ఉత్త నటనేనని, విద్యార్థులు, చిన్నారులే ప్రపంచంలో నిజమైన హీరోలని చెప్పారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని ప్రతిజ్ఞ చేశారు.
నీళ్లు, ఆహారం వృథా చేయొద్దు
దేశంలో అనేక మంది పేద పిల్లలు ఇంకా కలుషిత నీరు తాగుతున్నారని కైలాశ్‌సత్యార్థి ఆవేదన వ్యక్తంచేశారు. నీటిని, ఆహారాన్ని వృథా చేయొద్దని సూచించారు. బాలల హకుల చట్టాలను మరింత కఠినం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. బాలల హక్కుల కోసం సాటి బాలలు కృషి చేయాలని, విద్యార్థులు సమాజం కోసం ఆలోచించాలని కోరారు. బాలలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టవేయాలని, ఎక్కడ, ఎవరికి, ఏం జరిగినా బయటకు చెప్పే తెగువ చూపాలని అన్నా రు.
చిన్నారుల్లో ప్రశ్నించేతత్వాన్ని తల్లిదండ్రులు, గురువులు ప్రోత్సహించాలని సూచించారు. బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నదని స్పష్టంచేశారు. ‘నేను పనిచేస్తుంటే.. నీవు చదువుకొంటున్నావు’ అని ఒక పిల్లవాడు తనతో అన్న మాటలే తనను బాలల హక్కులపై పనిచేసేలా పురికొల్పాయని వివరించారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్ణయించుకొని, వాటిని సాధించేందుకు కఠినంగా ప్రయత్నించాలని, అప్పు డే కలలు సాకారమవుతాయని చెప్పారు.
ప్రతి ఒక్కరికీ చదువు: వినోద్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికీ చదువుకొనే హకు ఉన్నదని, దీనిని తెలంగాణ లో తూ.చా తప్పకుండా అమలు చేస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ విద్యార్థుల చదువు కోసం వెయ్యి గురుకులాల ను ప్రారంభించారని తెలిపారు. కుల, మత భేదం లేకుండా అన్ని వర్గాల వారు చదువుకొనే విధంగా రెసిడెన్సియల్ స్కూళ్ల ను అభివృద్ధి చేసినట్టు వివరించారు. పిల్లల హకులను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పారు.
బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు: చీఫ్ విప్ దాస్యం
బాలల హక్కుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొన్నదని ప్రభుత్వ చీఫ్ వినయ్‌భాసర్ వివరించారు. బాలల హకుల కోసం నిరంతరం పాటుపడే కైలాశ్ సత్యార్థి వరంగల్‌కు రావడం అదృష్టమని చెప్పారు. సభలో గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్, పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి పాల్గొన్నారు.