హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రెండేండ్లలోపు చిన్నారులకు దగ్గు సిరప్‌ను డాక్టర్లు సూచించవద్దని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సూచించింది. తల్లిదండ్రులు సైతం వైద్యుల సలహా తీసుకోకుండా దగ్గు మందును వాడొద్దని హెచ్చరించింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఐదేండ్లలోపు ఆపై వయసు ఉన్న చిన్నారులకు దగ్గు సిరప్ సిఫార్సు చేసే విషయంలో డాక్టర్లు జాగ్రత్తగా ఉండాలని కోరింది.
ఒకవేళ దగ్గు మందు సిఫార్సు చేయాల్సి వస్తే సరైన మోతాదు, నిర్ణీత కాల వ్యవధి, వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి స్పష్టం చేసింది. పిల్లల్లో దగ్గు ఎలాంటి మందులు వాడకుండానే తగ్గుతుందని స్పష్టంచేసింది. దవాఖానాలు సరైన ప్రమాణాలతో తయారైన ఉత్పత్తులనే వాడాలని సూచించింది. అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు ప్రభుత్వ అడ్వైజరీని తప్పనిసరిగా పాటించి అమలు చేయాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు వెంటనే ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని హెచ్చరించింది.