Cold | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలను పడిశం పట్టి పీడిస్తున్నది. మరోవైపు కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో.. వచ్చింది సాధారణ జలుబేనా? కాదా? అనే అనుమానం చాలామందిలో మెదులుతున్నది. అయితే ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు జ్వరం, జలుబు, దగ్గు వంటివి సాధారణమేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి లక్షణాలతో దవాఖానలకు వస్తున్నవారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉన్నా.. సీజనల్ జ్వరాల మాదిరిగా లేదని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని నిలోఫర్ దవాఖానలో సెప్టెంబర్, అక్టోబర్ సమయంలో జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలతో ఇన్‌పేషంట్లుగా చేరే పిల్లల సంఖ్య రోజూ 300-400 వరకు ఉండేదని, ఇప్పుడు 80-100 మధ్య నమోదవుతున్నదని దవాఖాన సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. ఇప్పుడు జలుబు, దగ్గుతో రోజూ 250 మంది పిల్లలు ఓపీకి వస్తున్నారని, సీజనల్ వ్యాధుల సమయంతో పోల్చితే ఇది తక్కువేనని తెలిపారు. కాబట్టి తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
దగ్గుకు నీళ్లే మంచి ఔషధం
దగ్గు తీవ్రంగా ఉన్న పిల్లల కోసం రెస్పిరేటరీ ఓపీ నిర్వహిస్తున్నాం. అనుమానిత లక్షణాలు ఉన్న పిల్లలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాం. జలుబు, దగ్గుతో బాధపడే పిల్లలకు వైద్యులు సూచించిన మేరకే మందులు వాడాలి. ఎక్కువగా యాంటిబయాటిక్స్ వేయొద్దు. ‘వాటర్ ఈజ్ బెస్ట్ కాఫ్ సిరఫ్’.. అంటారు, అంటే దగ్గుకు నీళ్లను మించిన ఔషధం లేదు. ఎక్కువగా ద్రవాహారం తీసుకోవాలి. తీవ్ర జ్వరం, ఆయాసం, ఆడుకోలేకపోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే దవాఖానకు తీసుకెళ్లాలి.
– ఉషారాణి తోట, సూపరింటెండెంట్, నిలోఫర్ దవాఖాన