సూర్యాపేట, మే 28 : ఇతర రాష్ర్టాల నుంచి శిశువులను కొనుగోలు చేసి, పిల్లలు లేని దంపతులకు అక్రమంగా విక్రయిస్తున్న ముఠాగుట్టును సూర్యాపేట పోలీసులు రట్టుచేశారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వివరాలను మీడియాకు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో అక్రమంగా శిశువులను కొనుగోలుచేసి దత్తత తీసుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారంతో సూర్యాపేట డీఎస్పీ ఆధ్వర్యంలో సూర్యాపేట సీసీఎస్ సీఐ, రూరల్ సీఐ ఆధ్వర్యంలో అంజయ్య, నాగయ్యను అరెస్ట్‌చేసి విచారణ చేయగా ముఠావిక్రయాలు బయటపడ్డాయి. వారి సమాచారం మేరకు జిల్లా కేంద్రానికి చెందిన నక్క యాదగిరి, ఉమారాణిని పోలీసులు విచారణ చేయగా 13 మందితో కూడిన ముఠా సభ్యుల దందా బయటపడింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్, మహారాష్ట్రలోని ముంబై నుంచి శిశువులను రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కొనుగోలు చేసి పిల్లలు లేనివారికి కమీషన్ల రూపంలో విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నక్క యాదగిరి, నక్క ఉమారాణి ఆటోలో తిరుగుతూ కోడిగుడ్లు అమ్ముకుంటూ.. సంతానంలేని దంపతులను గుర్తించి కమీషన్ తీసుకుని శిశు విక్రయాలకు పాల్పడుతున్నారు.
విజయవాడకు చెందిన కోరే నాగేందర్‌కుమార్, దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సభావత్ శ్రీనివాస్ మధ్యవర్తిత్వం ద్వారా శిశువులను దత్తత ఇచ్చారు. వీరితో పాటు విజయవాడకు చెందిన కొట్టే రమాలక్ష్మి, పిల్లల పావని, గిరికముక్కు విజయలక్ష్మి, ఆముదాలపల్లి సత్యమణి, నాగరకర్నూల్ జిల్లాకు చెందిన ముదావత్ రాజు, హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన ఐతా శోభారాణి, రాజస్థాన్‌కు చెందిన ఖాన్షాహీనా, హైదరాబాద్ తిరుమలగిరికి చెందిన సహానా, హైటెక్‌సిటీకి చెందిన ఈర్పుల సునీత సభ్యులుగా శిశువిక్రయాలకు పాల్పడుతున్నారు. వీరందరినీ సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో అరెస్ట్ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు హైదరాబాద్‌లో 10 మంది శిశువులను విక్రయించగా.. అందులో ఏడుగురు మగ, ముగ్గురు ఆడ శిశువులు ఉన్నారు. సూర్యాపేట మండలం టేకుమట్లలో ఇద్దరు బాలురు, సూర్యాపేట పట్టణంలో ఇద్దరు బాలికలు, పెన్‌పహాడ్‌లో ఒక బాలుడు, సూర్యాపేట జిల్లా ఉప్పలపహాడ్‌లో ఇద్దరు బాలురు, నల్లగొండ జిల్లా చిన్నసూరారంలో ఒక బాలిక, హైదరాబాద్‌లో ఒక బాలికను అమ్మినట్టు తేలడంతో వారిని గుర్తించి నల్లగొండలోని బాలల సంక్షేమ కేంద్రానికి తరలించారు. కాగా దత్తత తీసుకున్న తల్లిదండ్రులు చిన్నారుల కోసం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆస్తులన్నీ వారిపేరు మీద రాస్తాం .. పిల్లలను అప్పగించండి అంటూ పోలీసులను వేడుకున్నారు.