హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడుల్లో కొత్తగా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ను నియమించనున్నారు. ఉన్నతపాఠశాలల్లో పనిచేస్తున్న ఒక టీచర్నే ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా నియమిస్తారు. అంతేకాకుండా లీగల్ లిటరసీ క్లబ్బులు, చైల్డ్ రైట్స్ క్లబ్బులను సైతం పాఠశాలల్లో ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో బాలల రక్షణ, లీగల్ లిటరసీపై అవగాహన కల్పించే దిశలో విద్యాశాఖ కీలక అడుగేసింది. లీగల్ సర్వీసెస్ అథారిటీతో అవగాహన కుదుర్చుకున్నది.
సోమవారం హైదరాబాద్‌లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. చిన్న వయస్సులోనే విద్యార్థులకు హక్కులు, బాధ్యతలు, రక్షణ, న్యాయం పొందడంపై అవగాహన కల్పిస్తారు. రాష్ట్రంలోని 5,711 బడుల్లో బాలల హక్కుల పరిరక్షణ, బాల్యవివాహాలు, బాలకార్మిక చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.