ఉప్పల్, నవంబర్ 23: కంటి వైద్యం కోసం వెళ్తే ఐదేండ్ల చిన్నారి ప్రాణమే పోయిన ఘటన హైదరాబాద్ నగర పరిధిలో చోటుచేసుకున్నది. పటాన్చెరు ప్రాంతానికి చెందిన రవి, మౌనిక కుమార్తె అన్విక(5) కంటికి చీపురు పుల్ల తగలడంతో కంటి సమస్య ఏర్పడింది. దీంతో హబ్సిగూడలోని ఆనంద్ ఐ దవాఖాన కు తీసుకెళ్లారు. వైద్యపరీక్షల అనంతరం అన్వికను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో చిన్నారి అపస్మారక స్థితికి చేరుకున్నది. ఎటూ తోచని వైద్యులు బాలిక కుటుంబ సభ్యులకు తెలపకుండానే మెరుగైన వైద్యం కోసం ఎల్బీనగర్లో ని మరో దవాఖానకు తరలించారు.
ఈలోగా బాలిక మృతి చెందినదని తెలిపారు. తమకు సమాచారం ఇవ్వకుండా చిన్నారిని మరో దవాఖానకు తరలించారని, వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ, ఆనంద్ ఐ దవాఖాన ఎదుట కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. కాగా, జరిగిన ఘటనపై మేడ్చల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు స్పందించకపోవడం గమనార్హం.