పెద్దఅంబర్‌పేట, సెప్టెంబర్ 1: ‘వెళ్లొస్తా నాన్న.. బై బై’ అని కుమారుడికి చెప్తూ ఇంటి బయటకు వచ్చిన తండ్రి తన ఆటో ట్రాలీలో కూర్చున్నాడు. ట్రాలీని వెనక్కి తీస్తుండగా.. ఆ వెంట బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చిన 13 నెలల కొడుకు ఆ చక్రాల కిందే పడి నలిగిపోయాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన కళ్లెం నరేశ్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని లష్కర్‌గూడ రోడ్డులోగల ఎస్బీఐ ఎదుట నివసిస్తున్నాడు. ఉదయం పనికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇంటి వద్ద ఉన్న ఆటో ట్రాలీని వెనక్కి తీస్తున్నాడు. అదే సమయంలో 13 నెలల కుమారుడు లోహిత్ బంతితో ఇంట్లో ఆడుకుంటుండగా.. బంతి బయట ఉన్న ఆటో ట్రాలీ కింద పడింది. లోహిత్ వెనకనుంచి దాన్ని తీసుకునేందుకు ట్రాలీ కిందకు వెళ్లాడు. నరేశ్ గమనించకుండా ఆటోను వెనక్కి తీయడంతో దాని కిందే ఉన్న లోహిత్ వెనక చక్రం కిందపడి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ‘అయ్యో.. బిడ్డా’ అంటూ రక్తపుమడుగులో ఉన్న ఆ చిన్నారిని చేతిలో పట్టుకుని ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు.
ఘోర రోడ్డు ప్రమాదం ; లారీనీ ఢీ కొట్టిన ప్రైవేట్ బస్సు
మూసాపేట(అడ్డాకుల), సెప్టెంబర్ 1 : ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఐదుగురికి గాయాలైన ఘటన సోమవారం తెల్లవారుజామున మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం వద్ద చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు బీసీవీర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆదివారం రాత్రి 11 గంటలకు 32 మంది ప్రయాణికులు, డ్రైవర్, క్లీనర్‌తో బయల్దేరింది. మధ్యరాత్రి కావడంతో అందరూ గాఢనిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుజామున అడ్డాకుల శాఖాపూర్ టోల్గేట్ దాటి కాటవరం వద్దకు చేరుకోగానే బస్సు డ్రైవర్ ఖాదర్.. ముందు వెళ్తున్న లారీని అతివేగంగా క్రాస్తు చేస్తుండగా మరో కంటైనర్‌ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అల్లుడు, ప్రొద్దుటూరు సోములవీరాయిపల్లికి చెందిన కొత్తపల్లి హసన్(39) ఎగిరిపడగా లారీ అతని పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనితోపాటు కమలాపూర్‌కు చెందిన ఎల్లమ్మ(39), నంద్యాలకు చెందిన అష్రఫ్ ఉన్నీసాబేగం(70), నంద్యాల గోస్పాడుకు చెందిన సుబ్బారాయుడు(45) మృతి చెందారు. నంద్యాలకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన జ్యోషి, ఆళ్లగడ్డకు చెందిన ఓబులేసు, హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన శ్రీనివాస్‌రావుతోపాటు పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.