గోవిందరావుపేట, ఏప్రిల్13 : కోతులను చంపేందుకు బాలామృతంలో విషగుళికలు కలిపి పాఠశాల పక్కనే ఉన్న నర్సరీ ఆవరణలో అమర్చగా.., ఓ బాలుడు తిని మృతి చెందిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో జరిగింది. గోవిందరావుపేట గ్రామం తారకరామాకాలనీలో నివసిస్తున్న ఇరుగు శ్రావణ్- మమత దంపతులకు ఇద్దరు కూతుళ్లు వర్షిణి, రియాన్సీతోపాటు కొడుకు అశ్విత్నందన్(5) ఉన్నారు. ఆదివారం తండ్రి శ్రావణ్ ప్రాథమిక వైద్యం చేసేందుకు పక్క గ్రామానికి వెళ్లగా, తల్లి మమత కూలి పనులకు వెళ్లింది. బాలుడు మధ్యాహ్నం ప్రభుత్వ పాఠశాలలో ఆడుకునేందుకు వెళ్లాడు. నర్సరీ వైపు వెళ్లగా అక్కడ ప్లాస్టిక్ కవర్లో కోతులను చంపేందుకు విషగుళికలు కలిపిన బాలామృతం కవర్ కనిపించింది.
విషగుళికలు కలిపిన విషయం తెలియని బాలుడు ఆ బాలామృతాన్ని తిన్నాడు. అనంతరం ఇంటి వద్ద ఉన్న వర్షిణి, రియాన్సీతోపాటు ఇంటి పక్కన ఉండే మందుల మమతకు ఆ బాలామృతాన్ని ఇచ్చాడు. వారు నోట్లో వేసుకొని చేదుగా ఉండటంతో బయటకు ఉమ్మి వేయగా, అశ్విత్నందన్ నురుగులు కక్కుతూ కిందపడిపోయాడు. తమ్ముడు కింద పడిపోవడాన్ని చూసిన వర్షిణి, రియాన్సీ రోదిస్తుండటంతో చుట్టుపక్కల వారు వచ్చి శ్రావణ్‌కు సమాచారం అందించారు. వెంటనే అశ్విత్నందన్ను ములుగు ప్రభుత్వ దవాఖానకు అనంతరం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. బాలుడి మృతికి న్యాయం జరగాలంటూ మృతదేహంతో ధర్నా చేసేందుకు కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు జీపీ వద్దకు చేరుకున్నారు.
సీఐ దయాకర్, ఎస్సై తాజుద్దీన్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పరిశీలించి, బాధితులను సముదాయించారు. అశ్విత్నందన్ తల్లి మమతకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఈ మేరకు ఫోన్లో బాలుడి తల్లిదండ్రులను పరామర్శించి, కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి హామీతో కుటుంబసభ్యులు నిరసనను విరమించుకున్నారు. సీఐ సమక్షంలో బాలుడి కుటుంబసభ్యులతోపాటు గోవిందరావుపేట జీపీ పాలకవర్గసభ్యులు రాజీ కుదుర్చుకోగా, జీపీ పాలకవర్గం రూ.5లక్షల పరిహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, కారకులు ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని సీఐ వివరించారు.
కోతులను చంపేందుకు పాలకవర్గం చేసిన పనేనా..?
బాలామృతంలో విషగుళికలు కలిపి కోతులను చంపేందుకు పాలకవర్గమే కుట్ర పన్నిందని మృతుడి బంధువులతో పాటు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పలుచోట్ల ఇలాగే విషగుళికలు తిని సుమారు 30 వరకు కోతులు చనిపోయాయని స్థానికులు పేర్కొన్నారు. విషగుళికలు పెట్టి కోతులను చంపే హక్కు పాలకవర్గానికి ఎవరు ఇచ్చారని, ఘటనకు సంబంధించినవారిని గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చిన్నారులకు అంగన్వాడీ సెంటర్ల ద్వారా అందించే బాలామృతం బయటకు ఎ లా వచ్చింది…? అనే చర్చ గ్రామంలో జోరుగా కొనసాగుతున్నది. కోతులను చంపేందుకు గుర్తుతెలియని వ్యక్తులు బాలామృతాన్నే వాడటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. బాలామృతాన్ని ఎక్కడి నుంచి తెచ్చారు..? విషగుళికలు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఎవరు పెట్టారు..? అనేది చర్చగా మారింది.