జనగామ, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): స్కూలు బస్సు కిందపడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకున్నది. జనగామ మండలం అడవికేశ్వాపూర్కు చెందిన వరుణ్‌తేజ్(6) జనగామలోని గౌతమి మోడల్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. రోజూ స్కూల్ బస్సులో వెళ్లి వస్తుంటాడు. శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి గ్రామానికి చేరుకున్న వరుణ్‌తేజ్ బస్సులో నుంచి దిగుతుండగా బ్యాగు తట్టుకొని వెనుక టైర్ కింద పడిపోయాడు. డ్రైవర్ గమనించకుండా నిర్లక్ష్యంగా ముందుకు నడపడంతో బాలుడి తలపై నుంచి టైరు వెళ్లడంతో అకడికకడే మృతి చెందాడు. ఈ ఘటనతో విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ స్థానికులు, మృతుడి బంధువులు స్కూలు బస్సు అద్దాలు ధ్వంసం చేసి రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. జనగామ అర్బన్ సీఐ రఘుపతిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.