నాంపల్లి కోర్టులు, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడిగా ఉన్న శివరామ్ రాథోడ్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తుండగానే శుక్రవారం నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపోయేందుకు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను మెజిస్ట్రేట్ జీ ఉదయ్‌భాస్కర్‌రావు తిరస్కరించారు. కేసు పోలీసు విచారణలో ఉన్నదని, ఈ సమయంలో నిందితుడిని రిమాండ్‌కు తరలించే అవకాశం లేదని, కోర్టు చొరవ తీసుకోకూడదని పేర్కొన్నారు. శివరామ్రాథోడ్ను పోలీసులు అరెస్టు చేయకుండా ఉత్తర్వులను జారీచేయాలని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అందుకు మెజిస్ట్రేట్ నిరాకరించారు. దీంతో కోర్టు బయట అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.