హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : మైనంపల్లి హన్మంతరావు స్థాయికి మించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ చీఫ్ విప్ భాను ప్రసాద్‌రావు తెలిపారు. ప్రజా నాయకుడు, మంత్రి హరీశ్‌రావుపై వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆయన స్థాయేంటో తెలుసుకోవాలని హితవు పలికారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో విప్ ఎంఎస్ ప్రభాకర్‌తో కలిసి ఆయన మీడియాతో చిట్‌చాట్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెన్నంటి ఉన్న, ప్రస్తుతం బీఆర్ఎస్లో కీలక నేతల్లో ఒకరిగా మారిన హరీశ్‌రావుపై హన్మంతరావు వ్యాఖ్యలు సరికాదన్నారు.
నిబద్ధత కలిగిన రాజకీయ నేత, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేస్తున్న నాయకుడు హరీశ్ రావుపై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేయడం మంచిపద్ధతి కాదన్నారు. పార్టీలో ఉంటూ పార్టీ నియమావళి కాదని మాట్లాడిన హన్మంతరావుపై తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. హన్మంతరావు చరిత్ర ఎంటో అందరికీ తెలుసన్నారు.
తిరుమల వేదికగా మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి హన్మంతరావు నోటికొచ్చిట్టు మాట్లాడడం బాధాకరమని ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ తెలిపారు. ఇకనైనా రౌడీ రాజకీయాలు మానుకోవాలని, బెదిరింపు ధోరణిని మార్చుకోవాలని సూచించారు. హరీశ్‌రావుతోపాటు బీఆర్ఎస్ పార్టీకి హన్మంతరావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హన్మంతరావు విషయంపై పార్టీ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. హన్మంతరావుపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.
Chief Whip Bhanu Prasad Rao , MLA Hanmantha Rao,Minister Harish rao