హైదారాబాద్, మార్చి 22 (నమస్తేతెలంగాణ): అటవీ విస్తీర్ణం తక్కువగా ఉన్న జిల్లాల్లో రెండేండ్లలో గణనీయంగా అడవులు పెరిగేలా సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, కృషి చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో సీఎస్ అధ్యక్షతన తెలంగాణ కాంపా 8వ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అడవుల పెంపకంలో సాధించిన పురోగతిని సమీక్షించిన కమిటీ 2022-23 వార్షిక కార్యాచరణకు ఆమోదం తెలిపింది. అనంతరం సీఎస్ మాట్లాడుతూ.. కాంపా నిధుల వినియోగంలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉన్నదన్నారు. 2015 నుంచి రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. ఐఎస్ఎఫ్ఆర్ నివేదికల ప్రకారం జీవవైవిధ్యం, అటవీ ప్రాంతాల్లో నీటి లభ్యత, కార్బన్ నిల్వల పెరుగుదలలో కూడా తెలంగాణ ముందంజలో ఉన్నదని వెల్లడించారు. ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో భారీ ప్లాంటేషన్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఐదు అత్యాధునిక నర్సరీలను ఏర్పాటుచేయాలని సూచించారు. సమావేశంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఏ శాంతికుమారి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్, ఐజీఎఫ్ డాక్టర్ జీ త్రినాథ్‌కుమార్, అడిషనల్ పీసీసీఎఫ్ ఎంసీ పర్గేయన్, కాంపా పీసీసీఎఫ్, సీఈవో లోకేశ్ జైశ్వాల్, ఇతర అధికారులు హాజరయ్యారు.