హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): సీఎం బ్రేక్‌ఫాస్ట్ అద్భుత పథకమని ప్రముఖ శాంతా బయోటెక్ అధినేత కేఐ వరప్రసాద్‌రెడ్డి ప్రశంసించారు. శుక్రవారం ఉదయం పత్రికల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీం తాలూకు న్యూస్ చూడగానే తనకు సంతోషం వేసిందని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపారు. ‘మంచి చదువులు చదవాలి. మంచి ఉద్యోగాలు సంపాదించాలి అన్న ఆలోచనే తప్ప..మంచి పౌష్టికాహారాన్ని అందిద్దామన్న ఆలోచన నేటి కుటుంబాల్లో ఉండటం లేదు. హడావిడిగా టిఫిన్‌బాక్స్ పెట్టేసి.. స్కూల్ బస్సు ఎక్కిస్తే మా పనైపోయింది అన్నట్టుగా తల్లులు ఆలోచిస్తున్నారు. నేటిరోజుల్లో ఆరోగ్యం కన్నా.. డబ్బే ప్రధానమయ్యింది. సూర్యోదయం నుంచి మధ్యాహ్నంలోపు జఠరాగ్ని తీవ్రత అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. కానీ తల్లిదండ్రుల్లో అత్యధికులు ఉదయాన్నే పిల్లకు కాఫీ/టీతో సరిపుచ్చి స్కూల్‌కు పంపిస్తున్నారు. వాళ్లు ఉదయమంతా కడుపు మాడ్చుకుని, మధ్యాహ్నం టిఫిన్‌బాక్స్ తెరుస్తారు. ప్రతి ఇంట్లో జరిగే తంతు ఇదే. మంచి పౌష్టికాహారం అందితేనే మంచి చదువులు, మంచి ఆరోగ్యాన్ని పొందగలం. సీఎం బ్రేక్‌ఫాస్ట్ చాలా మంచి కార్యక్రమం. ఇలాంటి పథకాన్ని అమలుచేస్తున్నందుకు సెల్యూట్. ఈ పథకంతో లబ్ధిపొందిన ప్రతి తల్లి దీవిస్తుంది’ అని కేఐ వరప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.
సీఎం బ్రేక్‌ఫాస్ట్ మెనూ చాలా బాగుంది. ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్‌ను సమకూర్చడం గొప్ప విషయం. మన ఊరు-మన బడిలో భాగంగా రాష్ట్రంలో 4,700కు పైగా ఉన్నత పాఠశాలల్లో నిర్మించిన డైనింగ్ హాళ్లల్లోనే విద్యార్థులు కూర్చొని తినబోతుండటం ఆనందదాయకం.
-ఆర్ శ్రీధర్‌రెడ్డి,టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్
సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం పాఠశాల విద్యా చరిత్రలో నూతన పొద్దుపొడుపు. బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ వర్గాల కుటుంబాల పిల్లలకు ఈ పథకం గొప్ప వరం. సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అందజేస్తున్న సీఎం కేసీఆర్ అల్పాహార పథకంతో రాష్ట్రం నుదుటిన బంగారు బీజాక్షరాలు దిద్దారు.
-ఆంజనేయగౌడ్, సాట్స్ చైర్మన్