హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): వెనుకబడిన వర్గాల వారికి విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ తరువాత బిల్లు గతి ఏమిటో వెల్లడించకుండా ఢిల్లీ డ్రామాకు తెరలేపిందని బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపారా? లేక అసెంబ్లీ కార్యదర్శి వద్దనే పెండింగ్‌లో పెట్టారా? అన్న విషయాన్ని బయటపెట్టకుండా 9వ షెడ్యూల్లో చేర్చాలంటూ ఢిల్లీ కేంద్రంగా డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి 41వ సారి ఢిల్లీ వెళ్లారు.
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బుధవారం కొన్ని సంఘాలు తలపెట్టిన ధర్నాలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం వెళ్లిందని సీఎంవో కార్యాలయం తెలిపింది. సీఎంతోపాటు సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, మక్కన్సింగ్రాజ్ ఠాకూర్ తదితరులు మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారని పేర్కొంది.
బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడే బీసీ కమిషన్, డెడికేటెడ్ కమిషన్ నివేదికలను అధికారికంగా ఉభయ సభల్లో వెల్లడించాల్సి ఉండిందని బీసీ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో కూడా ఆమోదించాలని డిమాండ్ చేస్తూ కొన్ని కాంగ్రెస్ అనుబంధ సంఘాలు ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చాయని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆరోపించారు. అసెంబ్లీలో ఆమోదించిన రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు ఎక్కడున్నదో చెప్పకుండా, ఢిల్లీలో డ్రామాలు ఆడటం బీసీలను మోసం చేయటమేనని దుయ్యబట్టారు. పార్లమెంటు కంటే ముందు బిల్లు గవర్నర్ ఆమోదం పొందాలని అన్నారు. గవర్నర్‌కు పంపి ఉంటే బిల్లులో లోపాలు బయటపడేవని తెలిపారు. కానీ ఏకంగా ఢిల్లీకి వెళ్లి పార్లమెంటులో ఆమోదించాలని డిమాం డ్ చేయటం బీసీలను వంచించటమేనని విమర్శించారు.