Odisha | హైదరాబాద్, జనవరి 20(నమస్తే తెలంగాణ): సింగపూర్‌తో అవగాహనా ఒప్పందాల (ఎంవోయూ) విషయంలో ఒడిశా దూకుడు ప్రదర్శిస్తున్నది . తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనకు వెళ్లి రెండు ఎంవోయూలు కుదుర్చుకోగా.. ఏకంగా సింగపూర్ అధ్యక్షుడే ఒడిశా వచ్చి 8 ఒప్పందాలపై సంతకాలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఈ నెలాఖరులో భువనేశ్వర్‌లో నిర్వహించనున్న ఒడిశా ఇన్వెస్టర్ సమ్మిట్‌కు ముందు ఈ ఒప్పందాలు జరగగా, ఈ కార్యక్రమంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్చరణ్తోపాటు సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం పాల్గొనడం విశేషం. మన రాష్ట్ర సీఎం సింగపూర్‌లో కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటే, ఒడిశా రాష్ట్రం మాత్రం అక్కడి దేశాధ్యక్షుడి సమక్షంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నెటిజన్లు ఈ అంశంపై రెండు రాష్ర్టాలను పోల్చుకుంటూ పలు కామెంట్లు పెడుతున్నారు.
సీఎం రేవంత్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం రెండురోజులపాటు సింగపూర్‌లో పర్యటించి ప్రపంచ వాణిజ్య వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు బయల్దేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా సింగపూర్‌లో రాష్ట్ర బృందం సుమారు రూ.3,950 కోట్ల విలువైన రెండు ఒప్పందాలు కుదుర్చుకున్నది. అదే సమయంలో సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగరత్నం ఒడిశాలో పర్యటించగా, ఆయన సమక్షంలో ఒడిశా-సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఎనిమిది ఎంవోయూలు జరిగాయి. రాష్ట్ర ప్రతినిధి బృందం సింగపూర్, దావోస్ పర్యటనకు సుమారు రూ.12.5 కోట్లు ఖర్చవుతున్నట్టు అంచనా. కాగా, ఒడిశా ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయకుండానే సింగపూర్ బృందాన్నే తమ రాష్ర్టానికి ఆహ్వానించి అనేక విలువైన ఒప్పందాలు చేసుకున్నదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.