హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉన్నదని పేర్కొన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయదశమి పేరుతో దేశవ్యాప్తంగా జరుపుకుంటారని గుర్తుచేశారు. దసరా రోజున కుటుంబంలోని సభ్యులందరూ ఒకేచోట చేరి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. శమీపూజ చేసి జమ్మి ఆకును బంగారంగా భావించి అలయ్ బలయ్ చేసుకోవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, శుభసూచకంగా భావించే పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని గుర్తు చేశారు. తెలంగాణకు నిత్య విజయాలు కలిగాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలను ప్రసాదించాలని సీఎం దుర్గామాతను ప్రార్థించారు.
సీఎం సహాయనిధికి జింఖానా విరాళం
సీఎం సహాయనిధికి హైదరాబాద్ జిం ఖానా తరఫున రూ.24,17,118 విరాళం అందజేశారు. శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని జింఖానా చైర్మన్ రమేశ్‌బాబు, సెక్రెటరీ సత్యనారాయణ, బోర్డు సభ్యులు కలిసి ఈ మొత్తాన్ని అందజేశారు.
అన్నా.. మా జీతం ఎప్పుడొస్తది?
హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన పలువురు కార్పొరేషన్ల చైర్మన్లకు ఇప్పటివరకు వేతనాలు అందలేదని సమాచారం. మూడునాలుగు నెలలు గడుస్తున్నా ఓవైపు వేతనాలు అందకపోవడం మరోవైపు చైర్మన్ అయినప్పటి నుంచి నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే కార్పొరేషన్లకు నిధులు మంజూరయ్యాయని, ఆదాయం రానివాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు ఇటీవల కొందరు మంత్రులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్టు సమాచారం. ‘అన్నా.. మా జీతం ఎప్పుడొస్తుంది?. పండుగకు ఊరికి వెళ్లే పరిస్థితి కూడా లేదు. మాకే మో ఆదాయం లేదు. కానీ పండుగ ఇనాం అడిగేవాళ్లు ఎక్కువైపోయారు. ముఖం చాటేసుకొని తిరగాల్సి వస్తున్నది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారట. పైగా మార్చిలో చైర్మన్లుగా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఖర్చులే తప్ప ఆదాయం లేదని చెప్పుకొచ్చారట. వెంటనే వేతనాలు మంజూరు చేయించాలని కోరినట్టు తెలిసింది.