Kaloji Kalakshetram | వరంగల్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక రంగాల్లో వరంగల్ గుర్తింపును మరింత ఇనుమడింపచేసేలా కేసీఆర్ ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరుతో కళాక్షేత్రాన్ని నిర్మించింది. హనుమకొండ బస్టాండ్ సమీపంలో.. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మైదానంలో 4.25 ఎకరాల్లో రూ.85,10 కోట్లతో భారీ భవనాన్ని విభిన్నశైలిలో తీర్చిదిద్దారు. 1.39 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. నాలుగు అంతస్థుల సువిశాల భవనంలో.. 1500 సీటింగ్ సామర్థ్యంతో ఒక ఆడిటోరియంను ఏర్పాటు చేశారు. మినీ మీటింగ్ హాల్, డైనింగ్ హాల్స్, వీఐపీ సూట్స్‌ను అత్యాధునికంగా నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెండు మేకప్ రూములు, ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి. గ్యాలరీలో కూర్చుని చూడటానికి వీలుగా ఫ్రీ ఫంక్షన్ లాబీని ఏర్పాటు చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాలుగు హై కెపాసిటీ లిఫ్ట్‌లను బిగించారు. ఈ కళాక్షేత్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం రంగులు వేసి ప్రారంభానికి సిద్ధం చేసింది. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు.
కేసీఆర్ సంకల్పం
‘పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది’ అని రాయడంతోపాటు జీవితాంతం ఆచరించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడారు. 2012 నవంబర్ 13న ఆయన కన్నుమూశారు. తెలంగాణలోని కవులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పద్మభూషణ్ గుర్తింపు ఉన్న కాళోజీ నారాయణరావు విషయంలోనూ అలాగే చేశాయి. కాళోజీ నారాయణరావు స్మారక భవనం కోసం వరంగల్ నగరంలో కనీసం 300 గజాలు కేటాయించాలని కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. అయినా.. అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళోజీ నారాయణరావును గొప్పగా స్మరించుకుందామని అప్పటి ఉద్యమనేత కేసీఆర్ కాళోజీ ఫౌండేషన్ వారికి భరోసా కల్పించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కాళోజీ నారాయణరావు శతజయంతి అయిన 2014 సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ తొలిసారి వరంగల్ నగరానికి వచ్చారు. కళాక్షేత్రం భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ప్రధాన రహదారి పక్కనే 4.25 ఎకరాల్లో నాలుగు అంతస్థులతో నిర్మాణం ప్రారంభించారు. సాంస్కృతిక, పర్యాటక శాఖ మొదట్లో ఈ పనులు చేపట్టగా, తర్వాత కరోనా కారణంగా మూడేండ్లు నెమ్మదిగా సాగాయి. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ 2022లో సమీక్షించి కుడా నిధులతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అప్పటి నుంచి పనులు వేగంగా జరిగాయి. రూ.85.10 కోట్లతో సకల హంగులతో భవన నిర్మాణం పూర్తయ్యింది.