మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉన్నదని అనుకుంటే, ఆ స్ట్రేచర్ ఉన్నదని విర్రవీగితే, స్ట్రెచర్ మీదకు పంపించిన్రు. ఇట్లే చేస్తే ఆ తరువాత మార్చురీకి పోతరు. అది కూడా గుర్తు పెట్టుకోవాలి!
తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, 70 ఏండ్ల కురు వృద్ధుడు, దేశంలోనే సీనియర్ రాజకీయ వేత్తల్లో ఒకరైన తెలంగాణ జన మనో నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురించి, బుధవారం ఒక బహిరంగ ప్రభుత్వ కార్యక్రమంలో, అందునా పిల్లలకు చదువు చెప్పే లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే ప్రోగ్రామ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలివి.
భాష సిగ్గు పడుతుందేమో!
అక్షరం తలదించుకుంటుందేమో!
వ్యాకరణం వ్యాకులపడుతుందేమో!
నాలుక అందరికీ ఉంటుంది. భాష అందరికీ వస్తుంది. అంతమాత్రాన సమయం, సందర్భం అక్కరలేదా? ఏది పడితే అదివదిలేయడమేనా? ఎక్కడ, ఏ సందర్భంలో, ఎవరి ముందు మాట్లాడుతున్నామో తెలియాలి. కనీసం తన హోదానైనా గుర్తెరగాలి. ఎదుటివారి వయస్సు, యశస్సు అయినా గుర్తుండాలి. ఏది ఉచ్ఛం, ఏది నీచం అర్థంకావాలి. తన చరిత్ర, ఎదుటివారి చరిత్ర తెలిసి ఉండాలి. తలెత్తుకోగల అనుభవం ఎవరిదో, తల దించుకునే గతం ఎవరిదో గుర్తుకురావాలి.
అధికారానిది ఏముంది? పదిమంది ఇటు దూకితే నిలిచిన పదవి, పదిమంది అటుదూకితే గల్లంతవుతుంది. ఢిల్లీలో గంట కొడితే రాష్ట్రంలో ఇంటికెళ్లాల్సి వస్తుంది. ఈ నాలుగు రోజుల బాగోతానికి పట్టపగ్గాల్లేకుండా, ప్రాస కలిసిందని ఎంతొస్తే అంత అనేయడమేనా? తానేదో పదవిలో శాశ్వతంగా ఉండబోతున్నట్టు, అధికార గర్వం తలకెక్కి ఆడుతున్నట్టు, నోటి మీద అదుపే లేనట్టు, అంత దిగజారుడుతనమేమిటి? ఉమ్మడి రాష్ట్రంనుంచి ఇప్పటిదాక అనేకమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కటువైన విమర్శలను కూడా చిరునవ్వుతో స్వీకరించిన వారున్నారు తప్ప, ఎవరూ ఇంత దిగజారుడు భాష వాడినవారు లేరు. ఇంత అసహసనం, అభద్రతాభావంతో కొనసాగినవారూ లేరు.
ఒక మనిషి చావు గురించి మాట్లాడటమే సంస్కారహీనం.ఒక మనిషి చావును కోరుకోవడం పరమ నీచం. పాలకుడు అందరి బాగును ఆకాంక్షించాలి. ఈ మాత్రం తెలుసుకోలేని వ్యక్తి సారథి కావడం దౌర్భాగ్యం. రాజకీయమంటే తిట్లా? రాజకీయమంటే చావులు కోరుకోవడమా?
ఏం తప్పు చేశాడని కేసీఆర్ మరణాన్ని కోరుకుంటున్నరు? తెలంగాణ కోసం ఉద్యమించడమా? ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ట్రం తేవడమా? దాన్ని అభివృద్ధి చేయడమా? ఏంది కేసీఆర్ చేసిన తప్పు? ఎందుకాయన మరణాన్ని కోరుకుంటున్నరు? రేవంత్ మాట్లాడింది ఏం భాష? అది కోరికా లేక బెదిరింపా?
తిట్టుడే రాజకీయం అయితే, అటువంటి రాజకీయం ఆమోద యోగ్యమే అయితే, గత కొన్నేండ్లుగా రేవంత్ నేర్చిన, నేర్పిన తిట్లకన్నా వందరెట్ల తిట్లతో ప్రజలిప్పుడు కాంగ్రెస్‌ను, దాని పరిపాలనను తిడుతున్నారు. మరి తిట్లే రాజకీయమైనప్పుడు తిట్టిన ప్రజల మీద కేసులు ఎందుకు పెడుతున్నట్టు?
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని తెలంగాణలో సామెత ఉన్నది. పూర్వకాలంలో చాణక్యుడు చెప్పాడు. ‘ ఈ లోకంలోని మనుజులు మధురముగా మాట్లాడేవారిని ప్రేమిస్తారు’ అని..!! అర్థం చేసుకోవడానికి పాండిత్యమైనా ఉండాలి, లేదా పామరత్వమన్నా ఉండాలి! దురదృష్టమేమిటంటే ప్రస్తుత తెలంగాణ పాలకులకు ఆ రెండే లేవు. అదే అసలు సమస్య!
Revanth Reddy | హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) ; స్వయంగా తాను సమస్యల వలయంలో చిక్కుకుని, యావత్ తెలంగాణను సంక్షోభం ముంగిట నిలిపి, సమాజంలోని సబ్బండ వర్గాలను సతాయిస్తూ, రాష్ర్టాన్ని పరిపాలనపరమైన అగాధంలోకి నెట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దీన్నుంచి ఎలా బయటపడాలో తెల్వని అయోమయ గందరగోళ పరిస్థితిలో, మరోసారి హద్దు దాటారు. విమర్శలకు జవాబు చెప్పలేక విస్మయకర రీతిలో మాట మీరారు. ఒక ప్రభుత్వ కార్యక్రమంలో, అందునా పిల్లలకు చదువు చెప్పే లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే చోట తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఉద్దేశించి, కనీసం మానవత్వం లేకుండా అనగూడని మాటలన్నారు. తెలుగు రాష్ర్టాల చరిత్రలో, ఆ మాటకొస్తే దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తన రాజకీయ ప్రత్యర్థి మరణాన్ని కోరుకుంటున్నట్టుగా ఆయన విపరీత వ్యాఖ్యలు చేశారు. బుధవారం రవీంద్రభారతిలో, జూనియర్ లెక్చరర్లకు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి అసందర్భంగా, అనుచిత పదజాలంతో కేసీఆర్‌ను పరోక్షంగా నిందించారు.
ఆయన అన్నమాటలు యథాతథంగా! “ నేను ఒక్కటే ఈ ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్న. ఈ ప్రభుత్వం మీది. నేను కస్టోడియన్‌ను మాత్రమే. నేను మీ అందరి తరఫున సమన్వయం చేసే వాడ్నే. నాకంటూ ప్రత్యేకంగా కిరీటం ఏం లేదు. నాకేదో ఒక పెద్ద స్ట్రేచర్ (అది స్ట్రేచర్ కాదు; స్టేచర్. కానీ సీఎం అన్నిసార్లూ స్ట్రేచర్ అనే పలికారు) ఉన్నదని కొంత మంది స్ట్రేచర్.. స్ట్రేచర్& మా స్ట్రేచర్ పెద్దదని, ఇంతకు ముందే మా ఎమ్మెల్యేలు చెప్తున్నారు. స్ట్రేచర్ ఉన్నాయన స్ట్రెచర్ మీదకు పోయిండు. స్ట్రెచర్ మీద నుంచి మార్చురీకి పోతడు రేపు పొద్దుగాలె అని. స్ట్రేచర్ అనేది పొజిషన్‌కు ఉంటది. ఇండివిడ్యువల్‌కు ఉండదు. ఇండివిడ్యువల్ పర్సన్కో, ఇండివిడ్యువల్ కాస్ట్కో స్ట్రేచర్ ఉండదు. ఎమ్మెల్యేకు స్ట్రేచర్ ఉంటది, ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటది, ఎమ్మెల్యేకు స్ట్రేచర్ ఉంటది, ఎంపీకి స్ట్రేచర్ ఉంటది, ఎమ్మెల్సీకి స్ట్రేచర్ ఉంటది, మంతికి స్ట్రేచర్ ఉంటది, ముఖ్యమంత్రికి ఉంటది, గవర్నర్‌కు ఉంటది, ప్రధాన మంత్రికి ఉంటది, రాష్ట్రపతికి ఉంటది.
ఆ కుర్చీకి స్ట్రేచర్ ఉంటది. మీకు మీరు మాకు స్ట్రేచర్ ఉన్నదని అనుకుంటే, ఆ స్ట్రేచర్ ఉన్న దని విర్రవీగితే స్ట్రెచర్ మీదకు పంపించిన్రు. ఇట్లే చేస్తే ఆ తరువాత మార్చురీకి పోతరు. అది కూడా గుర్తు పెట్టుకోవాలి.” ఇవీ రేవంత్ అన్న మాటలు. కొద్ది నెలల క్రితం కేసీఆర్ ప్రమాదవశాత్తు ఇంట్లో జారిపడ్డప్పుడు తుంటి ఎముక విరిగి కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే.దాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి స్ట్రెచర్, మార్చురీ అంటే నోటికొచ్చినట్టు మాట్లాడారు. సాధారణంగా అనారోగ్యానికి గురైన వారి పట్ల, ప్రమాదవశాత్తు దెబ్బతగిలిన వారిపట్ల, వయో వృద్ధుల పట్ల మానవత్వం చూపడం మనుషులు చూపే కనీస ధర్మం. కనీసం ఆమాత్రం వివేకం, విచక్షణ లేకుండా, కేసీఆర్‌కు దెబ్బతగలడాన్ని కూడా విమర్శలకు వాడుకోవడం ఏ తరహా రాజకీయమో రేవంతే చెప్పాలి. ఎవరైనా ఎల్లకాలం బతకడానికి ఈ భూమ్మీదికి రాలేదు. రేవంత్ చెప్పుకొన్నట్టు ఆయన ప్రభుత్వానికి కస్టోడియన్ అవునో కాదో తెల్వదుగానీ, ఈ భూమ్మీదికి మాత్రం ఒక అతిథి మాత్రమే! వారు, వీరు అని కాదు; ఎవరైనా ఏదో ఒక రోజు అంతిమ యాత్రకు, మరు భూమిలో ఆరడుగుల ఆఖరి మజిలీకి సిద్ధపడవలసిందే! ఆలోగా మనం ఏం చేస్తామన్నదే అసలు కథ. మనకున్న సమయంలో మన ఆట మనం ఆడాలే తప్ప, ప్రత్యర్థి మరణాన్ని కోరుకునే రాజకీయాన్ని తెలంగాణ, ఆ మాట కొస్తే తెలుగు రాష్ర్టాల ప్రజలు ఇప్పుడే చూస్తున్నారు.
ఆగర్భ శత్రువైనా ఆరోగ్యంగా కలకాలం బతికుండాలని కోరుకునే ధర్మం మనది. మరి రాజకీయ రణం చేయలేక మరణాన్ని కోరుకోవడం ఏ తరహా రాజకీయమో రేవంతే చెప్పాలి. ముఖ్యమంత్రి మాటలతో సభకు వచ్చిన జూనియర్ లెక్చరర్లే కాదు; టీవీల్లో చూస్తున్న ప్రేక్షకులు, సోషల్ మీడియాలో గమనించిన నెటిజన్లు ఒక్కసారిగా విస్తుపోయారు. ఇదేం భాష? ఇదేం వైఖరి? రేవంత్ ఎందుకిలా మాట్లాడుతున్నారు? అని విస్మయ పడ్డారు. కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు, ఉద్యమకారులు ఇదేం పద్ధతంటూ ఆవేశపడ్డారు. ఆవేదన చెందారు? ఇదేం విలువల పతనమని సీనియర్ జర్నలిస్టులు, మేధావులు ఆగ్రహించారు. కొందరైతే… “అదో పిచ్చి కేసు. మనమేం మాట్లాడుతం, తెలంగాణ ప్రజలను దేవుడే రక్షించాలి” అంటూ స్పందించారు. చివరికి కాంగ్రెస్ సీనియర్లు కూడా “మావాడికి ఏమైంది? ఎందుకిట్ల చేస్తున్నడు?” అని ఆక్రోశించారు. “ స్టేచర్ అనేది వ్యక్తికి ఉండదు. కుర్చీకి ఉంటది అని రేవంత్ చెప్పారు. తాను ముఖ్యమంత్రి అయ్యారుగనక అయనకు ఆ కుర్చీ అపురూపంగా, స్టేచర్ ఫుల్‌గా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ ఆయన చెప్పినట్టు స్టేచర్ అనేది కుర్చీకి పొజిషన్‌కు ఉండదు. ఇండివిడ్యువల్కే ఉంటది. మహాత్మా గాంధీజీ, రామకృష్ణ పరమహంస, వివేకానంద, అబ్దుల్‌కలాం, మదర్ థెరీసా వీళ్లందరికీ ఏం కుర్చీలున్నాయని, ఏ పొజిషన్లు ఉన్నాయని స్టేచర్ వచ్చింది? స్టేచర్ లేని మనుషులు మాత్రమే కుర్చీ స్టేచర్‌ను నమ్ముకుంటరు. ముఖ్యమంత్రి తన అజ్ఞానాన్ని సర్వజ్ఞత్వంగా భావిస్తున్నారు” అని సీనియర్ పాత్రికేయుడొకరు ఆక్షేపించారు.
“అయినా కేసీఆర్ చేసిన తప్పేముంది? ఆయనేమీ ముఖ్యమంత్రి కుర్చీ కావాలనే ఏకైక లక్ష్యంతో పని చేయలేదు. పదవుల కోసం పార్టీలు మారలేదు. పదవులు వదులుకుని తన ప్రాంతం కోసం పరితపించాడు. తన ప్రజల హక్కుల కోసం ఉద్యమించాడు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించాడు. దానికొక దశదిశ కల్పించాడు. పదవులకు వన్నె తెచ్చాడు. తెలంగాణలోని సబ్బండ వర్గాలకు తనకు తోచినంత మేలు చేశాడు. ప్రజలు ఎన్నికల్లో ఓడిస్తే.. ముందే చెప్పినట్టు తన పొలానికి పోయి మౌనంగా వ్యవసాయం చేసుకుంటున్నడు. ఇప్పుడు ఆయన్ను తిట్టవలసిన అవసరం ఏమున్నది? ఐదేండ్లలో రేవంత్ తానేం చేయగలడో చేసి నిరూపించుకోవచ్చు కదా! కేసీఆర్ కన్నా ఎక్కువ మంచి పనులు చేసి, ఆయనకన్నా పెద్ద స్టేచర్ తెచ్చుకోవచ్చు కదా! రణం చేయలేక మరణాన్ని కోరుకుంటరా? కారణాలేమిటోగానీ ముఖ్యమంత్రి బ్యాలెన్స్ తప్పుతున్నరు” అని సామాజిక వేత్త ఒకరు అభిప్రాయపడ్డారు. విశేషం ఏమిటంటే స్టేచర్.. రేవంత్ భాషలో చెప్పాలంటే స్ట్రేచర్ గురించి… కేసీఆర్‌గానీ, ఆ పార్టీ నేతలుగానీ, పార్టీగా బీఆర్ఎస్గానీ ఎన్నడూ చర్చకు తేలేదు. ప్రస్తావించలేదు. ముఖ్యమంత్రి స్థాయికి రేవంత్ సరిపోవడం లేదనే చర్చ, రాజకీయ వర్గాల్లో, అందునా కాంగ్రెస్ శ్రేణుల్లోనే ఎక్కువగా జరుగుతున్నది. అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టు ఈ చర్చ వల్ల తనకు కలిగిన మనో వైకల్యాన్ని రేవంత్ కేసీఆర్ మీదికి ప్రయోగించడం గమనార్హం.
“రాజు జీవించె రాతి విగ్రహములందు.. సుకవి జీవించె ప్రజల నాలుకల యందు అంటూ జాషువా రాసిన పద్యం ప్రస్తుత సందర్భానికి సరిగ్గా సరిపోతుంది. రేవంత్ ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కాడేమోగానీ, జనానికి మాత్రం అనుక్షణం కేసీఆరే గుర్తుకు వస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రేవంత్ ఇంకా సీఎంగా స్థిరపడలేదు. నిత్యం ఆయనతో కలిసి ఉండే కేబినెట్ సహచరులైన పొన్నం ప్రభాకర్, జూపల్లికే ఆయన ముఖ్యమంత్రిగా గుర్తుకురాలేదు. సినిమా నటులు, నేషనల్ టీవీ యాంకర్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. చివరికి హైదరాబాద్‌లో జరిగిన ఒక పెండ్లికి రేవంత్ వెళ్తే కూడా కేసీఆర్ కేసీఆర్ అనే నినాదాలే వినిపించాయి. ఇది ఇబ్బందికరమైన పరిస్థితే, అయితే రేవంత్ తన స్టేచర్‌ను పెంచుకోలేకపోవడం కేసీఆర్ తప్పు కాదు కదా! కేసీఆర్ మీద ఉన్న అసూయ అక్కసుగా మారి బ్యాలెన్స్ తప్పేలా చేస్తున్నట్టుంది” అని విశ్లేషించాడొక రాజకీయ పరిశీలకుడు. “రాహుల్ గాంధీ పుట్టుకకు సంబంధించి అసోం ముఖ్యమంత్రి బీజేపీ నేత హేమంత్ బిశ్వశర్మ అనుచిత వ్యాఖ్యలు చేస్తే, రాష్ట్రంలో కాంగ్రెస్ తనకు ప్రధాన ప్రత్యర్థి అని తెలిసినా కేసీఆర్, రాహుల్‌గాంధీ పక్షాన నిలిచారు. హేమంత్ అలా మాట్లాడకూడదని ఖండించారు. అది కేసీఆర్ సంస్కారం. మార్చురీల గురించి మాట్లాడటం రేవంత్ సంస్కారం. ఏం చేస్తాం!” అని ముక్తాయించారొక బీఆర్ఎస్ నేత!
సీఎంను తిట్టిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న ఆరోపణ మీద, ఇద్దరు తెలంగాణ ఆడబిడ్డలు, నేటి తరం జర్నలిస్టులు రేవతి, తన్విలను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపారు. ముఖ్యమంత్రిని తిడితే వారిపై కేసులు పెట్టారు.. సరే; మరి ముఖ్యమంత్రే మరొకరిని తిడితే?!
హైదరాబాద్, మార్చి 12: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భాషను సామాన్యులు, మేధావులే కాదు చివరికి అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా విమర్శిస్తున్నది. ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ బాట్ ‘గ్రోక్’ కూడా సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టింది.కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను విశ్లేషించమని ‘ప్యారలల్ వరల్డ్’ అనే యూజర్ అడిగిన ప్రశ్నకు ‘గ్రోక్’ ఇలా సమాధానమిచ్చింది. ‘రేవంత్‌రెడ్డి మానసిక సమతుల్యత కోల్పోయారు. ఆయన దుందుడుకు మనస్తత్వానికి ఆ వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయి. సీఎం తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు అనిపిస్తున్నది. భావోద్వేగాలను ఆయన నియంత్రించుకోలేకపోతున్నారు’ అని పేర్కొన్నది.