హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): ఉద్యోగాల కల్పన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అబద్ధాలు చెప్తూ ప్రజలను, యువతను తప్పుదారి పట్టిస్తున్నదనే విమర్శలొస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగాలిస్తూ వాటిని కూడా తమ ఖాతాలో వేసుకుంటూ గొప్పలు చెప్తున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. భూమి కొలతల నిర్వహణకు సంబంధించి ఇటీవల శిక్షణ పొందిన ప్రైవేట్ సర్వేయర్లకు (Licensed Surveyor) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం లైసెన్స్‌లను అందజేశారు. మొత్తం 3,456 మందిని లైసెన్స్డ్ సర్వేయర్లగా ఎంపికచేశారు. వీరికి ప్రభుత్వం నుంచి నయా పైసా వేతనం రాదు. రైతులు, ప్రజల నుంచే ఫీజుల రూపంలో వసూలు చేసుకోవాలి. వీరిని ప్రైవేటు ఉద్యోగులుగానే పరిగణించాలి. కాగా, ప్రభుత్వం ఏదో గొప్ప పని చేసినట్టుగా సర్వేయర్లకు లైసెన్స్‌ల పంపిణీని కూడా ఘనంగా నిర్వహించింది. శిల్పకళా వేదికలో పెద్ద ప్రొగ్రాం ఏర్పాటుచేసి, అందరినీ అక్కడికి రప్పించి అంగరంగ వైభవంగా వారికి లైసెన్స్ పత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి అందజేశారు. అట్టహాసంగా సాగిన ఈ తతంగంపైనే విమర్శలొస్తున్నాయి.
సర్వేయర్ ఫీజు… రైతులపైనే భారం
సర్వేయర్లకు లైసెన్స్‌లు అందించి చేతులు దులుపుకొన్న సర్కారు.. రైతులపై కొత్త భారం మోపిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లైసెన్స్డ్ సర్వేయర్లకు ప్రభుత్వం నయా పైసా చెల్లించదు. భూములు సర్వే చేస్తే.. అందుకు సంబంధించిన ఫీజును రైతుల నుంచే వసూలు చేసుకోవాలి. దీంతో రైతులపై మరింత ఆర్థిక భారం పడనున్నది. సర్వేయర్లకు ఎంత ఫీజు చెల్లించాలనేది ప్రభుత్వం నిర్ణయించలేదు. దీంతో వారు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తారనే ఆందోళన వ్యక్తమవుతున్నది.. సాధారణంగా ప్రభుత్వ సర్వేయర్లకు ఎకరాకు రూ.150-200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ప్రైవేటు సర్వేయర్లు మాత్రం ఎకరాకు రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు లైసెన్స్డ్ సర్వేయర్లు సైతం ఇదేవిధంగా వసూళ్లు చేస్తే రైతులపై పెనుభారం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇదిలా ఉంటే, లైసెన్స్డ్ సర్వేయర్ చేసిన సర్వే ఫైనల్ కాదు. ఈ సర్వే రిపోర్ట్‌ను ప్రభుత్వ సర్వేయర్ ధ్రువీకరించాల్సి (సర్టిఫై) ఉంటుంది. దీంతో రైతులు సదరు ప్రభుత్వ సర్వేయర్‌కు కూడా ఎంతోకొంత ముట్టజెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో రైతులపై డబుల్భారం పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మీ శ్రమకు తగ్గ ఫీజు తీసుకోండి: సీఎం
సర్వేయర్లకు లైసెన్స్‌ల పంపిణీ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… ‘రైతుల సమస్యలు పరిష్కారం కావాలి. మీరంతా కష్టపడాలి. మీ కష్టంలో నిజాయితీ ఉండాలి. మీ శ్రమకు మీరు ఫీజు తీసుకోండి. తప్పులు చేయడం ద్వారా తమ కుటుంబసభ్యులకే అన్యాయం చేసినవాళ్లమవుతాం’ అని స్పష్టంచేశారు. అంటే రైతుల నుంచి ఫీజులు వసూలు చేసుకోండని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అదేవిధంగా తప్పులు చేయొద్దని సూచించారు. అంటే, సర్వే సమయంలో తప్పులు జరుగుతాయనే విషయం సీఎం రేవంత్‌రెడ్డికి తెలుసని, కానీ ఆ తప్పులను కట్టడి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ శాఖను బలోపేతం చేస్తున్నట్టు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయనే విమర్శలు న్నాయి. ప్రభుత్వ సర్వేయర్లను నియమించకుండా ప్రైవేటు సర్వేయర్ల నియామకంతో రెవెన్యూ శాఖ ఏ విధంగా బలోపేతమవుతుందని ప్రశ్నిస్తున్నారు. రెగ్యులర్ సర్వేయర్లను నియమించి ఉంటే, ప్రభుత్వం నిజంగానే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించినట్టుగా ఉండేదని, కానీ ప్రైవేటు వారికి లైసెన్స్‌లు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం చేసిన గొప్పతనం ఏమిటనే
విమర్శలొస్తున్నాయి.