హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): కన్నెపల్లి నుంచి నీళ్లను ఎత్తిపోసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. అవసరమైతే ఎన్డీఎస్ఏ ఇంజినీర్లకే అప్పగిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో మాదిరిగానే అవే అబద్ధాలను వల్లెవేశారు. ఓవైపు కరువు పరిస్థితులు నెలకొన్నాయని, మరోవైపు ప్రాణహిత నుంచి జలాలు దిగువకు వృథాగా పోతున్నాయని, వాటిని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి నుంచి ఎత్తిపోయాలని రోజురోజుకూ డిమాండ్ పెరిగిపోతున్నది. రేవంత్ సర్కార్ మాత్రం ఎన్డీఎస్ఏ నివేదికలను సాకుగా చూపుతూ, బరాజ్‌లు పనిచేయబోవని చెప్తూ నీటిని ఎత్తిపోయకుండా చోద్యం చూస్తున్నది. సర్కార్ నిర్లక్ష్యాన్ని వారం రోజులుగా బీఆర్ఎస్ నిలదీస్తున్నది. తాజాగా బరాజ్‌ల నుంచి నీటిని ఎత్తిపోయవచ్చంటూ తెలంగాణ విశ్రాంత ఇంజినీర్లు సైతం స్పష్టంచేశారు. ఈ మేరకు సర్కార్‌కు లేఖ రాశారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సైతం సర్కార్‌కు చురకలంటించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం సచివాలయంలో ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆపసోపాలు పడ్డారు. పదేపదే అబద్ధాలు వల్లెవేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై వ్యక్తిగత దూషణలకు దిగారు.
ఎన్డీఎస్ఏ నివేదికల సాకు..
సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డతో సహా అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను తెరిచిపెట్టాలని ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదికలో వెల్లడించిందని వివరించారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పరీక్షలన్నీ పూర్తి చేసి, పునరుద్ధరణ పనులు పూర్తిచేసిన అనంతరం బరాజ్‌లు వినియోగిస్తామని, అప్పటివరకు నీళ్లు ఎత్తిపోసేది లేదని తేల్చిచెప్పారు. అయినా నీళ్లను ఎత్తిపోయాలని డిమాండ్ చేయడం తప్పుదోవ పట్టించడమేనని ఎదురు దాడికి దిగారు. అదీగాక కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లను ఎత్తిపోయాలంటే 93.5 మీటర్ల లెవల్లో నీరు ఉండాలని, కానీ ప్రస్తుతం అక్కడ 89 మీటర్లే ఉన్నదని అబద్ధాలు చెప్పారు. వాస్తవమేమిటంటే మేడిగడ్డ బరాజ్‌లో బ్లాక్ 7లో పిల్లర్ కుంగుబాటు ఘటన తర్వాత వారం రోజుల్లోనే ఎన్డీఎస్ఏ బృందం ప్రాజెక్టును సందర్శించింది. అప్పటికీ టెస్టులేవీ చేయకుండానే, సమగ్ర పరిశీలన జరుపకుండానే నివేదికలు సమర్పించింది. వానకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ బరాజ్ గేట్లన్నీ తెరిచిపెట్టాలని సూచించింది. ఒకే రివర్‌బెడ్‌పై నిర్మించిన నేపథ్యంలో అన్నారం, సుందిళ్లల్లో మేడిగడ్డ తరహాలో ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నదని, అక్కడ పరీక్షలు చేయాలని, అప్పటివరకు ఆ బరాజ్‌లను సైతం తెరిచిపెట్టాలని ఊహాజనిత రిపోర్టును సమర్పించింది. ఏడాది తర్వాత 2025 ఏప్రిల్‌లో తుది నివేదిక సమర్పించింది.
చేయాల్సిన పునరుద్ధరణ పనులపై మార్గదర్శకాలు జారీ చేసింది. నివేదిక వచ్చినా ఏడాదిన్నరగా ఆ దిశగా పనులు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. ఈ విషయమై ప్రభుత్వాన్ని స్వయంగా ఎన్డీఎస్ఏ చైర్మనే నిలదీశారు. కానీ ఇప్పుడు ఎన్డీఎస్ఏ నివేదికలను సాకుగా చూపుతూ బరాజ్‌లను వినియోగించుకోలేమంటూ రేవంత్‌రెడ్డి వితండవాదానికి దిగడం గమనార్హం. మేడిగడ్డలో సాంకేతికంగా నీటిని నిల్వ చేయకున్నా ప్రస్తుతం ప్రాణహిత జలాలను కన్నెపల్లి నుంచి ఎత్తిపోసుకోవచ్చు. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బరాజుల్లో తలెత్తిన సీపేజీ సమస్యలను గతంలో అరికట్టారు. అవి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని అధికారవర్గాలే వెల్లడిస్తున్నాయి. అయినా రేవంత్‌రెడ్డి మాత్రం నీటిని ఎత్తిపోసేది లేదంటూ తేల్చిచెప్తున్నారు. ఎన్డీఎస్యే నివేదికలనే సాకుగా చూపెట్టేందుకు సిద్ధమయ్యారు.
ఎన్డీఎస్ఏను ఒప్పించాలట!
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రత్యేక సాంకేతిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసిందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. బరాజ్‌ల పునరుద్ధరణ ప్రతిపాదనలకు సాంకేతిక సలహాలివ్వడంతో పాటు విచారణలు, నిర్మాణ పనులు, నాణ్యత నియంత్రణ, ఏమైనా మార్పులు చేస్తే ఆ కమిటీకి తప్పనిసరిగా తెలియజేయాలని, ప్రభుత్వం ఆ సూచనల మేరకే ముందుకు సాగుతుందని తెలిపారు. కానీ కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు, ఇప్పుడు ఈటల రాజేందర్ సైతం నీళ్లను ఎత్తిపోయాలంటూ డిమాండ్ చేస్తున్నారని వారిపై అక్కసు వెల్లగక్కారు. అంతేకాదు బరాజ్‌ల్లో నీళ్లు నింపేందుకు ఎన్డీఎస్ఏను ఒప్పించాలని, ఆ బాధ్యత ఈటల తీసుకోవాలని, అప్పుడు ప్రభుత్వం సైతం ముందుకు వస్తుందని నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు యత్నించారు. బీఆర్ఎస్ హయాంలో పట్టిసీమ పూర్తయిందని, నీటి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయని, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వినియోగంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు పోవని చెప్పగలరా? అంటూ ఎదురు ప్రశ్నలకు దిగారు. కాళేశ్వరంపై విచారణ చేయాలని సీబీఐకి తాము లేఖ రాశామని, అయినా ఎందుకు విచారణ చేయడం లేదో చెప్పాలని ఈటలను ఎదురు ప్రశ్నించారు.
విశ్రాంత ఇంజినీర్లపై దుర్భాషలు
విలేకరుల సమావేశంలో విశ్రాంత ఇంజినీర్లపై సైతం సీఎం రేవంత్‌రెడ్డి దుర్భాషలకు దిగారు. ఇష్టారీతిన తూలనాడారు. కరువు నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకోవాలని, రైతులను, పంటలను కాపాడాలని, అవసరమైతే తమ సేవలను అందిస్తామని విశ్రాంత ఇంజినీర్లు ఇటీవల పత్రికా ముఖంగా ప్రకటించారు. ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే. మేడిగడ్డలో నీటిని నిల్వ చేయకుండానే ఎత్తిపోయవచ్చని, అన్నారం, సుందిళ్లలో సైతం మినిమమ్ డ్రా డౌన్ లెవల్‌కు నీళ్లు నింపి ఎత్తిపోతలు కొనసాగించవచ్చని, తద్వారా ఎలాంటి ప్రమాదం ఉండబోదని సైతం నొక్కిచెప్పారు. ఈ నేపథ్యంలో లేఖ రాసిన విశ్రాంత ఇంజినీర్లపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు.
‘తెలంగాణ మేధావుల ముసుగులో కన్నెపల్లి మోటర్లు వెంటనే ఆన్ చేయాలని లేఖ రాసిన రిటైర్డ్ ఇంజినీర్లను బొకలో వేయాలి. నాకు బేవకూఫ్ సలహాలు ఇస్తున్నరు. వాళ్లను బొకలో వేయకపోవడమే నేను చేసిన తప్పు. రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజినీర్లకు, సూపర్ ఎల్ నినో వస్తుందని చెప్పిన వాతావరణ శాఖ అధికారులకు బెల్ట్ ట్రీట్మెంటివ్వాలి. విశ్రాంత ఇంజినీర్ శ్యామ్ ప్రసాద్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు పంపితే తెలిసేది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం విలేకరుల సమావేశం ఆద్యంతం అడ్డగోలు అబద్ధాలు, బూతులతో సాగింది. చివరికి కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసేది లేదంటూ తెగేసి చెప్పారు.
భద్రాచలంపైనా అబద్ధాలు
మేడిగడ్డలో నీళ్లు నింపితే భద్రాచలంతోపాటు, దిగువన ఖమ్మం జిల్లాలో ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పత్రికాముఖంగా మరోసారి అబద్ధాలు చెప్పారు. అందుకు ఎన్డీఎస్ఏ నివేదికనే అడ్డంపెట్టుకున్నారు. వాస్తవమేమంటే మేడిగడ్డ వద్ద 2022లో గరిష్ఠంగా 28 లక్షల క్యూసెక్కుల (దాదాపు 260 టీఎంసీలకు పైగా) ప్రవాహం వచ్చిన సందర్భంలోనూ, భద్రాచలం వద్ద 34 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైన సందర్భంలోనూ భద్రాద్రి ఆలయం మునగలేదు. కానీ భద్రాద్రి మునిగిపోతుందని రేవంత్‌రెడ్డి అసత్య ప్రచారానికి పూనుకొని బీఆర్ఎస్పై ఆరోపణలకు దిగారు.
పంటలకు నీళ్లెందుకు..? వీళ్లను (పరోక్షంగా కేసీఆర్, కేటీఆర్,హరీశ్‌ను ఉద్దేశించి) కోసి రక్తం చల్లితే పంటలవే పండుతయ్. వీళ్ల బలుపు, కొవ్వు పంటలకు సరిపోతది.
-రైతుల పంటలకు నీళ్లు ఎలా ఇస్తారనే మీడియా ప్రశ్నకు రేవంత్ జుగుప్సాకర సమాధానమిది.
ఏ ముఖం పెట్టుకొని రిటైర్డ్ ఇంజినీర్లు కాళేశ్వరం నీళ్లు ఇవ్వుమంటున్నరు. నేను జైలుకు పంపుతలేనని.. నాకే సలహాలు ఇస్తున్నరా? వాళ్లకేకాదు, కరువు వస్తదని అన్న ఆఫీసర్లకూ బెల్ట్ ట్రీట్మెంట్ ఇయ్యాలె!
– అధికారులపై సీఎం అహంకారమిది
గలగలా గోదారి ఆంధ్రాకు పారి!
(10.7.26 సాయంత్రం 6 నుంచి11.7.26 సా. 6 వరకు)