హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ)/బడంగ్‌పేట: సాయిచంద్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన బాల్కం సుమన్, బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్, సింగరేణి కార్మిక నేత కెంగర్ల మల్లయ్య తదితరులు ఆయన చిత్రపటానికి పూలు వేసి నివాళి అర్పించారు. సీఎం కేసీఆర్ అందజేసిన గిడ్డంగుల చైర్పర్సన్ నియామక పత్రాన్ని సాయిచంద్ భార్య రజినికి అందజేశారు.
రజినితో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా తాము ఉన్నామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా బాల్కం సుమన్ మాట్లాడుతూ.. పుస్తకానికి మొదటి పేజీకి ఎంతైతే ప్రాధాన్యం ఉంటుందో బీఆర్ఎస్ పార్టీలో సాయిచంద్‌కు అంతే ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. సాయిచంద్ లేని బీఆర్ఎస్ పార్టీ వేదికలు లేవని, రాతి విగ్రహాలను సైతం కరిగించే శక్తి సాయిచంద్లో ఉన్నదని కొనియాడారు. ఇటీవల మరణాంతరం జరిగిన ఆసిఫాబాద్ సభలో సాయిచంద్ లేని లోటు కనిపించిందని ఆవేదన చెందారు.
జీఎస్సార్ ఫంక్షన్ హాల్లో దశదిన కర్మ
హైదరాబాద్ హస్తినాపురంలోని జీఎస్సార్ ఫంక్షన్ హాల్లో ఆదివారం సాయిచంద్ దశదిన కర్మ నిర్వహించనున్నట్టు బాల్క సుమన్ చెప్పారు. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, అభిమానులు హాజరవుతారని తెలిపారు.