హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): మన దేశం అనేక అంశాల్లో పొరుగుదేశాల కన్నా చాలా వెనుకబడి ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే చెప్తున్నారు. ముఖ్యంగా మోదీ హయాంలో దేశ ఆర్థిక వృద్ధి మందగించిందని, బంగ్లాదేశ్ వంటి దేశాలు సైతం వెనక్కి నెట్టాయని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు అక్షర సత్యం అని ప్రపంచబ్యాంకు సహా అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రధాని మోదీ 2014లో ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చేనాటికి మన దేశం కన్నా ఎంతో వెనుకబడి ఉన్న బంగ్లాదేశ్.. ఇప్పుడు మనల్ని మించిపోయింది. ఆరేండ్లలోనే ఆ దేశ తలసరి ఆదాయం రెట్టింపయితే.. మన దేశ తలసరి ఆదాయం 60 శాతం దాటడానికే అష్టకష్టాలు పడుతున్నది. తలసరి ‘జాతీయ స్థూల ఆదాయం (జీఎన్ఐ)’ లోనూ బంగ్లాదేశ్ మన కన్నా పైచేయిలోనే ఉన్నదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గ్రాస్ నేషనల్ ఇన్కమ్ (జీఎన్ఐ-స్థూల జాతీయ ఆదాయం) విషయంలోనూ బంగ్లాదేశ్ ముందంజలో ఉన్నది. ఒక దేశానికి విదేశాల నుంచి వచ్చిన నిధులు, విదేశాలకు తరలివెళ్లిన నిధులను జీడీపీకి కలిపితే వచ్చే ఆదాయాన్ని జీఎన్ఐగా వర్ణిస్తారు. ప్రపంచ బ్యాంకు 2022-23లో ప్రపంచవ్యాప్తంగా దేశాల జీఎన్‌ఐని అంచనా వేస్తూ.. ఆదాయం ఆధారంగా క్యాటగిరీలను నిర్ధారించింది.
ఇందులో భారత్‌ను దిగువ మధ్యతరగతి ఆదాయ దేశాల (లోయర్ మిడిల్ ఇన్కమ్) జాబితాలో చేర్చింది. 2014లో బంగ్లాదేశ్ తలసరి జీఎన్ఐ 1110 డాలర్లుగా ఉండగా, భారత్‌ది 1560 డాలర్లుగా ఉండేది. 2018 నాటికే బంగ్లాదేశ్ దాన్ని సమం చేసింది. 2021 నాటికి బంగ్లాదేశ్ తలసరి జీఎన్ఐ ఏకంగా 2620 డాలర్లుగా నమోదుకాగా, భారత్ 2170 డాలర్లకు పరిమితం అయ్యింది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ మరో 25 ఏండ్లలో దేశాన్ని సంపన్న దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకొన్నట్టు చెప్పారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం తలసరి జీఎన్ఐ కనీసం 13,205 డాలర్లు ఉంటేనే సంపన్న దేశంగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశ తలసరి జీఎన్ఐ 2170 డాలర్లు. సంపన్న దేశంగా మారాలంటే కనీసం ఆరు రెట్లు పెరగాలి.
2014 నుంచి 2021 వరకు తొమ్మిదేండ్ల మోదీ పాలనలో దేశ తలసరి జీఎన్ఐ 34 శాతమే పెరిగింది. ఈ లెక్కన సంపన్న దేశం కావాలంటే ఇంకా కనీసం 110 ఏండ్లు పడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మోదీ అనవసర అబద్ధాలు, జుమ్లా మాటలు, డంబాచారాలు పక్కనబెట్టి కనీసం ఎగువ మధ్యతరగతి ఆదాయ దేశాల (తలసరి జీఎన్ఐ 4256-13,205 డాలర్లు) జాబితాలో చేర్చడానికి ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు.