హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్ఠాత్మక ‘దాశరథి కృష్ణమాచార్య అవార్డు’ ఈ ఏడాదికిగాను ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని అయాచితం నటేశ్వరశర్మకు లభించింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ నెల 22న రవీంద్రభారతిలో జరిగే కృష్ణమాచార్య జయంతి ఉత్సవాల సందర్భంగా నటేశ్వరశర్మకు పురస్కారం అందిస్తారు. అవార్డుతోపాటు రూ. 1,01,116 నగదు బహుమతితో సత్కరిస్తారు. దాశరథి కృష్ణమాచార్య పురస్కారానికి ఎంపికైన నటేశ్వరశర్మకు ముఖ్యమంత్రి కేసీర్ శుభాకాంక్షలు తెలిపారు.
సంస్కృతాంధ్ర విద్వత్కవి, అష్టావధాని డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ 17 జూలై 1956లో కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డి గ్రామంలో జన్మించారు. 1969లో సంస్కృత విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లోనే సంస్కృతం, తెలుగులో పద్య, గేయ రచ నలు చేయడం ప్రారంభించారు. 1970లో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి తిరుమల శ్రీ వేంకటేశ్వర వేద సంస్కృత పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థిగా ఉన్న శర్మ సంస్కృత శ్లోకాలతో స్వాగతం పలకడంతో ఆయన ఆశ్చర్యపోయారు. అభినందించి మంచి కవిగా పేరు తెచ్చుకుంటావని ఆశీర్వదించారు. తర్వాత శర్మ తన పాండిత్య ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగారు. సంస్కృతం, తెలుగు భాషల్లో 50కిపైగా రచనలు ప్రచురితమయ్యాయి. వచన, గేయ, పద్యసంకలనా లు, శతకాలు, ఖండకావ్యాలు, విమర్శలు ఉన్నాయి.
కామారెడ్డిలోని ప్రాచ్యవిద్యాపరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1977 నుంచి సంస్కృత విభాగాచార్యులుగా, అనంతరం ప్రధానాచార్యులుగా పనిచేసి 2014జూలైలో నటేశ్వరశర్మ పదవీ విరమణ చేశారు. 2011నుంచి 2013వరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రాచ్యభాషా విభాగానికి పీఠాధిపతి(డీన్)గా సేవలు అందించారు. ఆయన సాహిత్య వ్యాసాలు, కవితలు, విమర్శలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అంతర్యామి శీర్షికతో చేసిన రచనలు పాఠకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఆయన సంస్కృత సంగీత రూపకం ‘నాగిని’ పేరుతో హైదరాబాద్ ఆకాశవాణిలో ప్రసారమై రామప్ప దేవాలయ శిల్పకళా వైభవాన్ని చాటింది. విద్యార్థి దశలో రాసిన వచన కవితా సంపుటి ‘విక్రాంతిగీతి’ దాశరథి ప్రశంసలు అందుకుంది. అవధాని శశాంక, శతావధాని సమ్మన్నగారి లక్ష్మీనరసింహశర్మ అవధానాలతో స్ఫూర్తి పొందిన శర్మ డాక్టర్ రంగనాథ వాచస్పతితో కలిసి జంట అవధానాలు చేశారు. నటేశ్వరశర్మ తొలి గేయసంపుటి ‘వసంతకుమారి’(1981). ఖండకావ్యాలలో సమయవిలాసిని, పంచశరీయం, సౌదామినీ విలాసం, చుక్కలు, చైత్రరథం, ఆటవెలది, జీవనయానం విశిష్ట రచనలుగా పేరుకెక్కాయి. వ్యావహారికభాషలో రాసిన ‘కవితాశతకం’.. శ్రీశ్రీ రచన ‘సిరిసిరిమువ్వ’ శతకాన్ని తలపిస్తుంది. ఆయన విశిష్ట సాహిత్య సేవలను గుర్తించిన ‘భక్తిసాధనమ్’ ఆధ్యాత్మిక సంస్థ గజారోహణ పురస్కారంతో సత్కరించింది.
నటేశ్వరశర్మ రచించిన అభిజ్ఞాన శాకుంతలానికి పద్యానువాద ప్రబంధం ‘శకుంతల’కు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ కావ్యపురస్కారం లభించింది. దేశభక్తి కవితా సంపుటి ‘భారతీ ప్రశస్తి’కి జాతీయ సాహిత్య పరిషత్తు పురస్కారం అందుకున్నారు. రుతువుల సోయగాలను వర్ణిస్తూ రచించిన ‘రుతుగీత’కు ఉత్తమ కావ్యపురస్కారం వరించింది. తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని ప్రస్తుతిస్తూ సంస్కృతంలో రాసిన ‘తెలంగాణ సుప్రభాతం‘.. ‘తెలంగాణ’ మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురితమై పాఠకులను ఆకట్టుకున్నది. రాష్ర్టావిర్భావం తర్వాత 33 జిల్లాల ప్రత్యేకతలను తెలుపుతూ రాసిన పద్యాలు ఈ నేల విశిష్టతను చాటాయి. సంస్కృతాంధ్ర భాషల్లో శర్మ నూటికిపైగా అష్టావధానాలు చేశారు. అవధాన ప్రతిభకు తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం ల భించింది. ఆదిశంకరాచార్యులు రచించిన ‘సౌందర్యలహరి’పై పరిశోధనలకుగాను 1994లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా, స్వర్ణపతకం అందుకున్నారు. ఆముక్తమాల్యదపై ఆయన విమర్శనా గ్రంథం ప్రామాణికమైంది.
రంజని-విశ్వనాథ పద్యకవితా పురస్కారం(2009), కిన్నెర ఆర్ట్ థియేటర్ వారి వచన కవితా పురస్కారం(2010), కిన్నెర-కుందుర్తి వచన కవితా పురస్కారం(2011), రాష్ట్రకవి ఔగేటి ధార్మిక సాహితీ పురస్కారం(2012), తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అవధాన కీర్తిపురస్కారం(2012), సర్వవైదిక సంస్థానం విశిష్టకవి పురస్కారం(2013), తెలంగాణ పద్య సాహిత్య పురస్కారం(2013), శాతవాహన విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ పద్యకవి పురస్కారం(2014), తేజ ఆర్ట్ క్రియేషన్స్ నుంచి విశిష్టకవి పురస్కారం (2014), విశ్వసాహితి విశిష్ట సాహిత్య పురస్కారం(2014), భక్తి టీవీవారి ఆధ్యాత్మిక సేవా పురస్కారం(2014), తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అవధాన ప్రతిభా పురస్కారం(2015), ఇందూరు అపురూప సాహితీ పురస్కారం(2016), వర్గల్ సరస్వతీ క్షేత్రం వారి ‘అవధాన భారతి’ పురస్కారం(2020), మల్లినాథసూరి కళాపీఠం వారి ‘మహోపాధ్యాయ’ పురస్కారం(2021), డీవీఎల్ఎన్ శాస్త్రి స్మారక సాహితీ పురస్కారం(2021), కోటంరాజు స్మారక సాహితీ పురస్కారం(2021) వంటి పురస్కారాలు ఎన్నింటినో నటేశ్వరశర్మ అందుకున్నారు.