CM Revanth Reddy | కరీంనగర్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రజాపాలన-విజయోత్సవాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పెద్దపల్లి జిల్లాకేంద్రంలో నిర్వహించిన యువవికాసం బహిరంగ సభ.. యువకులకు ఇచ్చిన పలు హామీలను విస్మరించింది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రధాన శాఖల మంత్రులు హాజరైనా యువజనానికి భరోసా దక్కనేలేదు. ఈ సభపై నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలు అ డియాశలయ్యాయి. ఆరు గ్యారెంటీల్లో భా గంగా యువవికాసం కింద విద్యార్థులకు ఇస్తామన్న రూ.5 లక్షల విద్యాభరోసా కార్డులపై ముఖ్యమంత్రి మాట కూడా మాట్లాడలేదు. యూత్ డిక్లరేషన్‌లో ఏటా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చి చరిత్రను తిరగరాశామని సీఎం చెప్పుకొచ్చారు. అంటే యువవికాసం సభ సాక్షిగా మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయామని ఒప్పుకున్నట్టే కదా? అని నిరుద్యోగ యువత పెదవి విరుస్తున్నది. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిపై మాటమాత్రమైన సీఎం, మంత్రులు చెప్పలేకపోయారు. కేసీఆర్ ప్రభుత్వం ఎగ్గొట్టిన రైతుబం ధు 7,625 కోట్లను తమ ప్రభుత్వం రాగానే ఇచ్చిందని సీఎం ఓ అబద్ధం ఆడారు. సభకు వచ్చిన పలువురు మధ్యలోనే వెనుదిరిగవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి.
ప్లకార్డులతో సింగరేణి కార్మికుల పిల్లల నిరసన
యువవికాసం సభలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగిస్తుండగా రామగుండం ని యోజకవర్గానికి చెందిన సింగరేణి కార్మికుల పిల్లలు వివిధ డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. 25 మంది వరకు నినాదాలు చేశారు. సింగరేణిలో మారు పేర్ల సమస్యను పరిష్కరించాలని నినదించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అక్కడికి చేరుకొని వారిని శాంతింపజేశారు.