హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని జిల్లా కోర్టులను కాగితరహితం (పేపర్‌లెస్)గా మార్చనున్నట్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ప్రకటించారు. శనివారం నుంచి 4 జిల్లా కోర్టు ల్లో ఈ-ఫైలింగ్ విధానం అమల్లోకి వస్తుందని.. వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జగిత్యాల కోర్టుల్లో ఈ విధానం ప్రారంభమవుతుందని వెల్లడించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైకోర్టు భవనంపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ అరాధే ప్రసంగిస్తూ.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 37 ఈ-సేవ కేంద్రాలను ప్రారంభించనున్నట్టు తెలిపారు.
హైకోర్టులో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు సువిశాల ప్రాంగణం అవసరమని, అందుకే ప్రభు త్వం రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో 100 ఎకరాల భూమిని కేటాయించిందని చెప్పారు. గతంలో రూపొందించిన న్యాయనిర్మాణ్ డాక్యుమెంట్ ప్రకారం నూతన హైకోర్టు భవన నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. న్యాయవాదుల సంక్షేమానికి హైకోర్టు కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పీ నాగేశ్వరరావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ పీ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జీ ప్రవీణ్‌కుమార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి ఎస్ గోపర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.