న్యూఢిల్లీ, అక్టోబర్ 9: సుప్రీంకోర్టులో తనపై జరిగిన షూ దాడి యత్నంపై భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ మొదటిసారి స్పందించారు. ఆ అనూహ్య ఘటనపై రెండురోజుల తర్వాత సీజేఐ మౌనం వీడారు. అది ఓ మరచిపోయిన అధ్యాయంగా సీజేఐ అభివర్ణించారు. గురువారం జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కలసి విచారణ కార్యకలాపాలు సాగిస్తున్న సందర్భంగా సీజేఐ గవాయ్ న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడుతూ సోమవారం జరిగిన సంఘటనతో తాను చాలా దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. తమ వరకు అది ఓ మరచిపోయిన అధ్యాయమని సీజేఐ అన్నారు. అయితే ఆయన పక్కనే ఉన్న జస్టిస్ భుయాన్ మాత్రం ఈ ఘటనను వదిలిపెట్టలేదు. ఆయన ఓ సీజేఐ. ఇదేమీ నవ్వులాట విషయం కాదు. ఎన్నో ఏళ్లుగా న్యాయమూర్తులుగా కొనసాగుతున్న మేము చాలా తీర్పులు ఇస్తాము. కొందరికి అవి న్యాయసమ్మతంగా అనిపించకపోవచ్చు. అంతమాత్రాన మేము మా అభిప్రాయాలను మార్చుకోలేము అని జస్టిస్ భుయాన్ వ్యాఖ్యానించారు.
సీజేఐపై బూటు విసరడానికి ప్రయత్నించిన న్యాయవాది రాకేశ్ కిషోర్ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టు సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ప్రకటించింది. కిశోర్ ప్రవర్తన న్యాయవ్యవస్థ స్వతంత్రత, బార్, బెంచ్ మధ్య చిరకాలంగా కొనసాగుతున్న పరస్పర గౌరవం, నమ్మకం, కోర్టు కార్యకలాపాల పవిత్రతపై ప్రత్యక్ష దాడిగా పేర్కొంది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, ఖజరాహోలోని ఒక విష్ణు విగ్రహ పునరుద్ధరణ కేసులో సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కోర్టు కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో న్యాయవాది కిషోర్ (71) సోమవారం ఆయనపై బూట్ విసిరిన సంగతి తెలిసిందే. బెంగళూరు పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సీజేఐపై దాడి ఘటనపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి మార్కెండేయ కట్జూ స్పందించారు. కోర్టుల్లో న్యాయమూర్తులు సంయమనం పాటించాలని, తక్కువ మాట్లాడాలని సూచించారు. దాడి ఘటనను ఆయన ఖండించారు. అయితే జడ్జిలు కోర్టుల్లో అనవసర వ్యాఖ్యల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతాయని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల పని వినడం అని, మాట్లాడటం కాదని, వాదనలు విన్న తర్వాత ఏది న్యాయమో తేల్చడం వారి పని అని అన్నారు.