Telangana CEC | ఉత్తర్వులు జారీ చేసిన ఎన్నికల సంఘం
హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఎన్నికల విధుల్లో భాగంగా ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగస్వాములైన అధికారుల బదిలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ నెల 21వ తేదీ నుంచి తుది ఓటర్ల జాబితా విడుదలయ్యే అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ నిషేదం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఓటర్ల జాబితా రూపకల్పనలో పాల్గొనే జిల్లా ఎన్నికల అధికారులు(డీఈవో), ఉప జిల్లా ఎన్నికల అధికారులు, ఓటరు రిజిస్ట్రేషన్ అధికారులు(ఈఆర్వో), సహాయ ఓటరు రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల(ఏఈఆర్వో)తో పాటు బూత్ లెవల్ ఆఫీసర్స్(బీఎల్వో) స్థాయి వరకు ఈ నిషేధం వర్తిస్తుందని వికాస్ రాజ్ పేర్కొన్నారు.
ఈ జాబితాలోని అధికారులు సెలవుపై వెళ్లాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని వికాస్ రాజ్ స్పష్టంచేశారు. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలనుకుంటే సీఈవోతో పాటు తమ కమిషన్ అనుమతి తీసుకోవాలని ఈసీ పేర్కొంది. ఈ నిషేధం పై జాబితాలోని పోస్టుల ఖాళీలను భర్తీ చేయడంలోనూ వర్తిస్తుందని పేర్కొంది.