హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): పోలింగ్ కేంద్రాల వద్ద స్థానికంగా విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి డ్యూటీలు వేయొద్దని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాజ్రాజ్ సూచించారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయంలో వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలకు చెందిన పోలీస్ నోడల్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లను వివరించారు.
రాజకీయ కార్యక్రమాలను వీడియోలు తీయడంపై అన్ని వీడియో నిఘా బృందాలకు శిక్షణ ఇవ్వాలని, అయితే వారు మొబైల్ ఫోన్లతో కాకుండా కచ్చితంగా కెమెరాలతోనే చిత్రీకరించాలని పరిశీలకులు సూచించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి, పెండింగ్లో ఉన్న అన్ని 6వ నంబరు ఫారాలను నవంబర్ 10 లోగా పరిషరించాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ వీ నాయక్, మాజీ ఐపీఎస్ అధికారి దీపక్ మిశ్రా, ప్రత్యేక వ్యయ పరిశీలకుడు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి బాలకృష్ణన్ పాల్గొన్నారు.
పోలింగ్ రోజున ఏదైనా ప్రతికూల వార్త ప్రసారమైతే నోడల్ అధికారి వెంటనే వాస్తవ వివరాలను తెలుసుకొని, వాటిని తిరిగి సంబంధిత ఛానళ్లకు తెలియచేసి వాస్తవ సమాచారం ప్రసారమయ్యేట్టు చూడాలని అధికారులకు సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వారి సామర్థ్యం మేరకు పని చేయాలని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ అజయ్ బాదూ, ఆదేశించారు. పంకజ్ శ్రీవాస్తవ్, డైరెక్టర్, ప్రత్యేక వ్యయ పరిశీలకుడు బాలకృష్ణన్ మధ్యాహ్నం సీఈవో కార్యాలయంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సీనియర్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.