హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): చికెన్, మటన్‌తో పోల్చుకుంటే కొవ్వు తకువగా ఉంటుందని చేపలు తినేవారికి చేదు వార్త. సముద్రం లేదా నదుల్లో పట్టే చేపలు తింటే ఫర్వాలేదు. కానీ, చెరువుల్లో పెంచే చేపలు తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఎందుకంటే.. చేపలకు వేస్తున్న మేత ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు గుర్తించారు. చేపల మేతకు అవసరమైన ముడి పదార్థాల ధరలు పెరగడంతో కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారు. దీంతో కొందరు భారీగా కోళ్ల వ్యర్థాలను సేకరించి, చేపల పెంపకందార్లకు అమ్ముతున్నారు. ఇది కాసులు కురిపిస్తుండటంతో కోళ్ల వ్యర్ధాల వ్యాపారానికి భాగ్యనగరం అడ్డాగా మారింది. ప్రతి రోజూ హైదరాబాద్ నుంచి వందల టన్నుల చికెన్ వేస్ట్‌ను అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నారు. కోళ్ల వ్యర్థాలతో చేపలను పెంచడం చట్టవిరుద్ధమైనప్పటికీ యథేచ్ఛగా ఈ దందాను కొనసాగిస్తున్నారు.
రాత్రి లోడింగ్.. తెల్లారేలోగా రవాణా
కొందరు వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి హైదరాబాద్‌లోని చికెన్ షాపుల్లో మిగిలిపోయిన వ్యర్థాలను సేకరిస్తున్నారు. అనంతరం వాటిని మూసాపేట, అంబర్‌పేట, అత్తాపూర్ తదితర ప్రాంతాల్లోని స్టాక్ పాయింట్లలో డంపింగ్ చేస్తున్నారు. చీకటి పడ్డాక ఆ వ్యర్థాలను కంటైనర్ లారీల్లోకి లోడ్ చేసి, తెల్లారేలోగా ఏపీలోని చేపల చెరువులకు తరలిస్తున్నారు. అలా ప్రతి రోజూ దాదాపు 300 టన్నుల చికెన్ వ్యర్థాలను తరలిస్తున్నట్టు సమాచారం. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని పర్యావరణ వేత్తలు స్పష్టం చేస్తున్నారు.