కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 3: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా అడవుల్లో మంగళవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య 13కి చేరింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో మరో ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నట్టు పోలీసు ఉన్నతాధికారులు బుధవారం వెల్లడించారు. మరణించిన 13 మందిలో ముగ్గురు మహిళలు ఉన్నారని తెలిపారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు.
మృతదేహాలను గుర్తించేందుకు జిల్లా కేంద్రానికి తరలించారు. మృతులంతా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) 2వ నెంబర్ కంపెనీకి చెందిన మావోయిస్టులు అని పోలీసులు పేర్కొన్నారు. కాగా, తాజా ఎన్కౌంటర్ ఘటన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. సరిహద్దు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి విజయ్ శర్మ మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నదని, ఈ క్రమంలో మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.