నార్కట్పల్లి: రాష్ట్రంలో రెండో శ్రీశైలంగా ప్రాచుర్యం పొందిన నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు (Cheruvugattu) పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా రథసప్తమి రోజు బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఆరు రోజులపాటు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన బుధవారం.. స్వామివారికి వేదపండితులు శేషవాన సేవ నిర్వహించనున్నారు.
ఉత్సవాల్లో భాగంగా 10వ తేదీ రాత్రి అగ్నిగుండాలు, 11న దోపోత్సవం, 12న పుష్పోత్సవం నిర్వహిస్తారు. ఈనెల 13న గ్రామోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. రాష్ట్రంలోని ఏ శివాలయంలోనైనా శివరాత్రి రోజు శివకల్యాణం నిర్వహించడం సంప్రదాయం. అయితే ఒక్క చెర్వుగట్టులోనే రథసప్తమి రోజున కల్యాణం నిర్వహిస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల నుంచి భక్తులు పెద్దత్తున తరలివస్తారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదట ఆలయ మహా మండపంలో గణపతి పూజ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పుణ్యాహవాచనం, పంచజన్య, పూజాప్రోక్షణ, అఖండ స్థాపన, త్రిశూల పూజా సూర్య నమస్కార పూజలు చేశారు. అగ్ని ప్రతిష్ఠాపన సృష్టికర్త బ్రహ్మ ప్రత్యేక పర్యవేక్షణలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం చేశారు. బుధవారం తెల్లవారుజామున కల్యాణోత్సవానికి భక్తులు తరలివచ్చారు. ఎమ్మెల్యే చిరుమర్తి ప్రభుత్వం తరఫున తలంబ్రాలు, పట్టు వస్ర్తాలు సమర్పించారు.