హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): చర్లపల్లి రైల్వే టర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం జాతికి అంకితం చేశారు. అత్యాధునిక సౌకర్యాలతో రూ.413 కోట్లతో నిర్మించిన ఈ టర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. చర్లపల్లి టర్మినల్ ద్వారా సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. ఇండియన్ రైల్వే కొత్తరూపు సంతరించుకున్నదని పేర్కొన్నారు. హైస్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతున్నదని వెల్లడించారు. వందేభారత్, అమృత్ భారత్, నమో భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని స్పష్టంచేశారు. రైల్వేల ఆధునీకరణ దేశం ముఖచిత్రాన్నే మార్చేస్తున్నదని చెప్పారు. కొత్త రైల్వే ట్రాక్‌లతోపాటు అండర్ బ్రిడ్జిల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు. జమ్మూ రైల్వే డివిజన్, రాయగఢ్‌లోని ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. ఆర్ఆర్ఆర్కు కేంద్రం సహకరించాలని ప్రధాని మోదీని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. చర్లపల్లి టర్మినల్ ప్రారంభోత్సవానికి ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు.