హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తేతెలంగాణ): ‘రాష్ట్రంలో ఎస్సీలను విభజించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. కులవివక్ష లేదని ఆగస్టు 1న సుప్రీంకోర్టు తీర్పుచెప్పడం ఆక్షేపణీయమని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని 341 ఆర్టికల్‌కు వ్యతిరేకంగా ధర్మాసనం తీర్పునివ్వడం శోచనీయమని చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని 30 లక్షల మంది మాలల ఐక్యత, ఆత్మగౌరవాన్ని చాటేందుకే డిసెంబర్ 1న సింహగర్జన సభ నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సభను ఎవరికీ వ్యతిరేకంగా నిర్వహించడంలేదని, కొందరు మాత్రం ఎందుకు భయపడుతున్నారో అర్థంకావడంలేదని చెప్పారు. మాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి ఈ సభ ద్వారా తీసుకెళ్తామని పేర్కొన్నారు. దళితులకందిన ఫలాలన్నీ మాలలే అనుభస్తున్నారని కొందరు అభాండాలు వేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు ఛైర్మన్ చిన్నయ్య, నాయకులు సర్వయ్య, మల్లయ్య, మందా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.