Ponguleti Harsha Reddy | హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన తనయుడు హర్షారెడ్డి నివాసాలపై శుక్రవారం జరిగిన ఈడీ సోదాలు ఓ స్మగ్లింగ్ కేసుకు సంబంధించినవేనన్న వాదన ఒకటి వినిపిస్తున్నది. వాచీల కోసం కోట్ల రూపాయలను క్రిప్టో ద్వారా పంపి హర్షారెడ్డి మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ గుర్తించినట్టు తెలిసింది. చెన్నై కస్టమ్స్ అధికారుల నివేదిక ఆధారంగానే ఢిల్లీకి చెందిన 16 బృందాలతో శుక్రవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారని అంటున్నారు. రూ.1.7 కోట్ల విలువైన వాచీల అక్రమ రవాణా కేసులో పొంగులేటి హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్ అధికారులు గత మార్చి 28న నోటీసులు ఇచ్చి.. ఏప్రిల్ 4న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. అయితే డెంగీ జ్వరం కారణంగా రాలేనని, ఏప్రిల్ 27న ప్రత్యక్షంగా హాజరౌతానని ఆయన లేఖ రాశారు. అప్పట్లో హర్షారెడ్డి తనకు వాచీల అక్రమ రవాణాతో సంబంధం లేదని జాతీయ మీడియాతో చెప్పారు. అయితే, ఇదే కేసులో చెన్నైకి చెందిన కస్టమ్స్ అధికారులు గత జూన్ మూడో వారంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
హాంకాంగ్ టు చెన్నై.. వయా సింగపూర్!
చెన్నై విమానాశ్రయంలో ఫిబ్రవరి 5న కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.1.7 కోట్ల విలువైన రెండు లగ్జరీ వాచ్‌లు పొంగులేటి హర్షారెడ్డి కోసమేనని దర్యాప్తులో తేలినట్టు తెలిసింది. హాంకాంగ్ నుంచి సింగపూర్ మీదుగా వచ్చిన మహమ్మద్ ఫహెర్దీన్ ముబీన్ అనే వ్యక్తి నుంచి కస్టమ్స్ అధికారులు ఆ వాచీలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వాచీలలో ఒకటి పాటెక్ ఫిలిప్స్ 5740, రెండోది బ్రెగ్యుట్ 2759గా గుర్తించారు. పాటెక్ ఫిలిప్స్ వాచీకు మన దేశంలో ఎక్కడా డీలర్లు లేకపోవడం.. బ్రెగ్యుట్ కంపెనీల వాచీలు ఇండియా మార్కెట్లో స్టాక్ లేకపోవడంతో వాటిని స్మగ్లింగ్ చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. వాటి విలువ రూ.1.7 కోట్ల పైగా ఉంటుందని తేల్చారు. దీంతో ముబీన్‌ను అరెస్టు చేసి, కోర్టు అనుమతితో విచారణ చేయగా మధ్యవర్తి నవీన్‌కుమార్ పేరు బయటకు వచ్చింది.
క్రిప్టో చెల్లింపులు.. హవాలా లావాదేవీలు!
చెన్నై కస్టమ్స్ అధికారులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. మార్చి 12న ఈ కేసులో వారికి అలోకం నవీన్‌కుమార్ ద్వారా మరిన్ని ఆధారాలు లభించినట్టు సమాచారం. నవీన్‌కుమార్ ద్వారానే ముబీన్ నుంచి హర్షారెడ్డి వాచీలను కొనుగోలు చేసినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించినట్టు తెలిసింది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది ట్రెజరీ (యూఎస్డీటీ)కి చెందిన టెథర్ వంటి క్రిప్టో కరెన్సీ రూపంలో డబ్బులు చెల్లించారని కస్టమ్స్ అధికారులు దర్యాప్తులో వెల్లడైనట్టు తెలిసింది. హర్షారెడ్డి కోసమే వాచీలు తీసుకొచ్చానని నవీన్‌కుమార్ తన వాంగ్మూలంలో అంగీకరించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే హర్షారెడ్డికి కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
మొత్తం రూ.100 కోట్లకు పైనే స్మగ్లింగ్..
డబ్బున్న వ్యక్తులకు ఖరీదైన వాచీలను సప్లయ్ చేయడంలో ముబీన్, నవీన్‌కుమార్ ఆరితేరినట్టు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో చెన్నై కస్టమ్స్ అధికారులు మార్చి 18న మద్రాస్ హైకోర్టుకు ఇచ్చిన వివరణలో లగ్జరీ వాచీల స్మగ్లింగ్ సుమారు రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపారు. ముందస్తు బెయిల్ కోసం నవీన్‌కుమార్ పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. రూ.100 కోట్లకుపైగా ఉన్న ఈ స్మగ్లింగ్‌లో బెయిల్ ఇవ్వడం కుదరదని కోర్టు స్పష్టంచేసింది. తమిళనాడులోని అలందూరు కోర్టు వెంటనే నవీన్‌కుమార్‌ను అరెస్టు చేసి, హర్షారెడ్డిని విచారించాలని ఏప్రిల్‌లో ఆదేశాలు జారీచేసింది. దీంతో ఏప్రిల్ 4న తమ ఎదుట హాజరుకావాలని హర్షారెడ్డికి నోటీసులు అందాయి.