Minister Ponguleti Srinivasa Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కుమారుడు హర్షా రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. స్మగుల్డ్ గూడ్స్‌కు సంబంధించిన కేసులో చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షకు నోటీసులు ఇచ్చారు.
పొంగులేటి కుమారుడు హర్ష పటెక్ ఫిలిప్, బ్రిగెట్ బ్రాండ్లకు చెందిన రెండు లగ్జరీ వాచ్‌లను ఇటీవల ఆర్డర్ చేశాడు. భారత్‌లో దొరకని ఈ బ్రాండ్లు తెప్పించుకునేందుకు నవీన్ కుమార్ అనే వ్యక్తి సహాయంతో ముబిన్ అనే స్మగ్లర్‌ను ఆశ్రయించాడు. హర్ష కోసం ముబిన్ ఆ రెండు వాచ్‌లను సింగపూర్ నుంచి తెప్పించాడు. ఈ వాచ్‌ల విలువ ఒక్కోటి రూ.1.75 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వాచ్‌ల కోసం హవాలా రూపంలో డబ్బు చెల్లించినట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసుకున్న చెన్నై కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటికే నవీన్‌కుమార్‌ను విచారించిన చెన్నై కస్టమ్స్ అధికారులు.. తాజాగా హర్షకు కూడా నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్ 4వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. అయితే తనకు ఒంట్లో బాగోలేదని.. ఏప్రిల్ 27 తర్వాతే విచారణకు హాజరవుతానని పొంగులేటి హర్ష రిప్లై ఇచ్చాడు. కాగా, స్మగుల్డ్ గూడ్స్ రూపంలో తీసుకొచ్చిన మొత్తం వాచ్‌ల స్కామ్ విలువ రూ. 100 కోట్ల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.