హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): పాఠశాల, కళాశాల స్థాయిలోనే కాదు.. ఉన్నతస్థానాల్లో ఉన్న మహిళలకు పురుషుల నుంచి వేధింపులు తప్పడం లేదని సీఐడీ అదనపు డీజీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. సమాజమంతా ఏకమైతేనే మహిళలపై వేధింపులు ఆగుతాయని అన్నారు. తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో శనివారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ‘మానవుల అక్రమ రవాణా నిరోధక చట్టం-1956 అమలులో సవాళ్లు’ అన్న అంశంపై ఆయన మాట్లాడారు. దేశంలో డ్రగ్స్ తర్వాత అత్యధిక ఆదాయం మానవ అక్రమ రవాణా ద్వారా లభిస్తుండటం అ త్యంత విచారకరమని చెప్పారు. ఎంతోమంది అమాయక మైనర్లు, యువతులు వ్యభిచార కూపంలో కూరుకుపోయారని, వారిని రొంపి నుంచి బయటపడేసేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
అవయవాలే కాకుండా తెల్లచర్మం కోసం మనుషుల అక్రమ రవాణా జరుగుతున్నదంటూ పలు ఘటనలను వివరించారు. మసాజ్ సెంటర్లు, బ్యూటీపార్లర్ల పేరుతో కొందరు వ్యభిచారం చేస్తున్నారని.. నేపాల్, బంగ్లాదేశ్ వాళ్లు ఎకువగా ఈ వృత్తిలోకి వచ్చేలా నిర్వాహకులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. విదేశాల సర్వర్లతో ఆన్లైన్ వ్యభిచార వ్యాపారం చేస్తున్నారని, అభం శుభం తెలియని మహిళల ఫొటోలు పెడుతూ వారిని బజారుకీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కామన్ వెల్త్, ఆసియా, ఫుట్‌బాల్ వంటి పోటీలు నిర్వహించే దేశాల్లో వ్యభిచార వ్యాపారం బాగా పెరుగుతున్నదని అన్నారు. ఈ జాడ్యాన్ని అరికట్టిన చోట్ల నేరాల సంఖ్య, మానవ హకుల ఉల్లంఘనలు తగ్గాయని మహేశ్ భగవత్ వివరించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ శ్రీసుధ, జస్టిస్ రాధారాణి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాష్ట్రవ్యాప్తంగా కింది కోర్టుల్లో వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. నూతన జిల్లాల కోర్టు భవనాల కోసం 5 నుంచి 20 ఎకరాల వరకు కేటాయించిందని, వాటిల్లో అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ న్యాయవాదుల పోస్టుల భర్తీలో మహిళలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్టు గణాంకాలతో సహా ఏజీ వివరించారు. పోరాటాల ఫలితంగానే మహిళలు న్యాయవాద వృత్తి నిర్వహించే హకు లభించిందని సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి చెప్పారు. బార్ కౌన్సిల్ చట్టంలో సవరణ చేసి ప్రతి రాష్ట్ర కౌన్సిల్లో ఇద్దరు మహిళలు ఉండేలా చేయాలని కోరినా ఫలితం లేకపోయిందని బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి తెలిపారు. అసోసియేషన్ అధ్యక్షురాలు పాములపర్తి రేవతిదేవి అధ్యక్షతన జరిగిన సదస్సులో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు సుమాలినీరెడ్డి, ఉపాధ్యక్షురాలు మాధవిదేవి, న్యాయవాదులు హేమవతి, విజయలక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం అసోసియేషన్ తరఫున అతిథులను ఘనంగా సతరించారు.