హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): డ్యామ్‌ల డ్యామేజ్‌తో దండిగా సంపాదించొచ్చుననే కుట్రలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది. అధికార బలంతో ఇసుక మాఫియా కు అడ్డులేకుండా పోయింది. బీఆర్ఎస్ సర్కా ర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చెక్‌డ్యామ్‌ల నిర్మాణాన్ని మాఫియా అపహాస్యం చేస్తున్నది. కరీంనగర్ జిల్లా తనుగుల చెక్‌డ్యామ్ కూల్చివేత ఉదంతంతో ఎన్నో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నా యి. ఇసుక మాఫియా ఆగడాలతో రాష్ట్రవ్యాప్తంగా చెక్డ్యామ్లన్నింటికీ ప్రమా దంపొంచి ఉన్నదని ఇరిగేషన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇష్టారీతిగా ఇసుకను తొలగిస్తుండటంతో నిర్మాణాలపై తీవ్ర ప్రభావం పడుతున్నదని సంబంధిత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాడు ప్రత్యేక దృష్టి
తెలంగాణ ఏర్పాటు తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వాగుల పునరుజ్జీవంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని వాగులపై కలిపి 2015లోనే రూ.764కోట్లతో 202 చెక్‌డ్యామ్‌లను నిర్మించింది. అనంతరం సుమారు మరో రూ.3825 కోట్లతో 1200 డ్యామ్‌లను నిర్మించాలని సంకల్పించి మొదటి దశలో కృష్ణా బేసిన్లో 192, గోదావరి బేసిన్ లో దాదాపు 465 డ్యామ్‌లు మొత్తంగా 657 నిర్మాణాలు చేపట్టింది. అందులో సుమారు 450లకుపైగా నిర్మాణం కూడా పూర్తి చేసుకున్నాయి. అదే ఊపుతో రెండో దఫాలో కూడా 543 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలనూ సిద్ధం చేసిన విషయమూ తెలిసిందే.
చెక్‌డ్యామ్‌ల్లోనూ ఇసుక నిల్వలు
రాష్ట్రంలోని మానేరు, మున్నేరు, ఆకేరు, పాలేరు, స్వర్ణ, పెద్దవాగు, కూడవెల్లి, చలివాగు, నారింజవాగు, బొగ్గులవాగు తదితరాలపై బీఆర్ఎస్ ప్రభుత్వం చెక్‌డ్యామ్‌లను నిర్మించింది. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మానేరుపై దాదాపు 114 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం జరిగింది. అందులో పదుల సంఖ్యలో డ్యామ్‌లను మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టులతో అనుసంధానించి క్రమం తప్పకుండా నీటిని వదులుతూ జలకళను పులిమింది కేసీఆర్ సర్కార్. బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుచూపు చర్యతో రాష్ట్రవ్యాప్తంగా చెక్‌డ్యామ్‌ల వద్ద భారీగా ఇసుక మేటలు ఏర్పడటంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కన్ను సదరు డ్యామ్‌లపై పడింది. ఇసుక దందాతో వేలకోట్ల ఆదాయం సమకూర్చుకునేందుకు చెక్‌డ్యామ్‌లే సరైన వనరుగా భావించి కొందరు వాటి డ్యామేజ్‌పై కన్నేసినట్టు ఇరిగేషన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో నే ఆయా ప్రాజెక్టుల ద్వారా, కాల్వల ద్వారా చెక్‌డ్యామ్‌లను నింపకుండా వదిలేస్తున్నారని కూడా వివరిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా ఆయా వాగుల నుంచి ఇసుక తోడివేతను ఇష్టారాజ్యంగా సాగిస్తున్నారు. అందులోభాగంగానే ఉమ్మడి మహబూబ్‌నగర్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మెదక్ జిల్లాల పరిధిలో వాగులను ఇసుకమాఫియా చెరబట్టిందని తెలుస్తున్నది. పోలీసులు, రెవెన్యూ అధికారులు నామమాత్రంగానే పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారంటే వాస్తవ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. చెక్‌డ్యామ్‌ల వద్ద పేరుకుపోయిన ఇసుక నిల్వలను ఖతం చేసేందుకే అని స్పష్టంగా తెలుస్తున్నది. కరీంనగర్ జిల్లా ఓదెల మండలం తనుగుల వద్ద మానేరుపై నిర్మించిన చెక్‌డ్యామ్‌ను ఇటీవల ఇసుకమాఫియానే పేల్చివేసింది. ఆ ఘటన మరువక ముందే మహబూబ్‌నగర్ జిల్లా వంగూరులోనూ అదే తరహాలో ఘటన చోటు చేసుకోవడం అనుమానాలు మరింత పెంచుతున్నది.
ఇష్టారీతిగా ఇసుకతీతతో మరో ప్రమాదం..
ఇష్టారీతిగా ఇసుక తోడుతుండటంతో చెక్‌డ్యామ్‌లకు భారీ ప్రమాదం పొంచి ఉన్నదని ఇరిగేషన్‌వర్గాలు వెల్లడిస్తున్నా యి. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ గతంలోనే దేశమంతటికీ వర్తించేలా ఎన్ఫోర్స్మెంట్ మానిటరింగ్ గైడ్‌లైన్స్ ఫర్ శ్యాండ్ మైనింగ్ పేరిట మార్గదర్శకాలు రూపొందించింది. దీనికి అనుగుణంగానే తెలంగా ణ ప్రభుత్వం జీవో 38 ద్వారా 2014 లోనే న్యూ శ్యాండ్ మైన్ పాలసీ రూపొందించింది. కలెక్టర్, సంయుక్త కలెక్టర్, పంచాయతీ, భూగర్భ జలశాఖ, నీటిపారుదల శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పీసీబీ, మైన్స్ అండ్ జియాలజీ విభాగాల నేతృత్వంలో కమిటీవేసి ఇసుక నిర్వహణ అనుమతులపై పకడ్బందీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వాడుకలో ఉన్న చెక్‌డ్యామ్‌ల్లో పూడికను తొలగించేందుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదనే నిబంధననే సాకుగా చూపుతూ ఇసుకమాఫియా అధికార పార్టీ నేతల అండదండలతో చెలరేగిపోతున్నదని ఇరిగేషన్‌శాఖ అధికారులు, సామాజిక, పర్యావరణవేత్తలు వెల్లడిస్తున్నారు. చెక్డ్యామ్ల్లోని ఇసుకను ఖతం పట్టిస్తున్నారని, ఇష్టారీతిగా తవ్వకాలు చేపడుతున్నారని వివరిస్తున్నారు.