హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ‘ఒక్కరూ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేస్తలేరు. వీళ్లు మీకు న్యాయం చేయరు. అవసరమైతే సీఎం రేవంత్‌రెడ్డినే కలవండి. ఆయనకే చెప్పుకోండి. అప్పుడైనా మీకు న్యాయం జరుగుతుందేమో చూద్దాం?’ ఇదీ నిరుద్యోగ టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వంలోని కీలక నేత ఇచ్చిన సలహా. 24 గంటలకు మా తలుపులు తెరిచే ఉంటాయన్న ఇందిరమ్మ రాజ్యంలో, ప్రజాపాలనలో బాధితులకు సాక్షాత్తు ప్రభుత్వంలోని పెద్దలు ఇలాంటి సలహాలు ఇవ్వడమేంటని ఉద్యోగ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
లెక్కచేయని అధికారులు
ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత సలహా ఇచ్చింది ఎవరోకాదు. క్యాబినెట్ ర్యాంక్ హోదాలో గల ప్రభుత్వ ప్రతినిధి. రాజకీయాల్లో చాలా సీనియర్. గతంలో మంత్రిగానూ పనిచేశారు. అయితే ప్రభుత్వంలో కీలకంగా ఉన్నా ఆయన్ను ప్రభుత్వ అధికారులు లైట్ తీసుకుంటున్నారు. ఏ మాత్రం గౌరవించడంలేదు. ఐఏఎస్‌ల నుంచి మొదలు.. కింది స్థాయి అధికారుల వరకు సీనియార్టీకి, హోదాకు విలువనివ్వడంలేదు. ఆయన ఫోన్‌చేస్తే లిఫ్ట్ చేయడంలేదు. కనీసం సమాధానం చెప్పడంలేదు. తర్వాతైనా స్పందించారా? ఫోన్ చేస్తారా? అంటే అదీ లేదు. ఇదీ సీనియర్ నేత వ్యవహారశైలి. ప్రభుత్వంలో కీలక పోస్టులో ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఫలితంగా అసహనానికి లోనయ్యారు. శుక్రవారం ఆయన ‘చిన్న’ బుచ్చుకున్నారు. ఆగ్రహంతో కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఫోన్‌చేస్తే స్పందిస్తే ఒట్టు
డీఎస్సీ క్రీడా కోటా బాధితులు కొందరు శుక్రవారం బేగంపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే భవన్లో ప్రతినిధులు, అధికారులను కలిసి పిటిషన్లు సమర్పించారు. స్పోర్ట్స్ కోటా టీచర్ రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగాయని, అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని మరోసారి ఫిర్యాదుచేశారు. రీవెరిఫికేషన్ ఫలితాల కోసం 9 నెలలుగా తమ గోడును పట్టించుకోకపోవడం ఆవేదన వ్యక్తంచేశారు. క్యాబినెట్ ర్యాంక్ గల ప్రతినిధి.. అభ్యర్థుల వద్దకు వచ్చి సమస్యపై ఆరా తీశారు. దీంతో సదరు నేత పీఏ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీకి ఫోన్ చేయగా, తాను విమానాశ్రయంలో ఉన్నానని చెప్పి ఫోన్ కట్చేశారట. ఆ తర్వాత పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్‌కు ఫోన్‌చేయగా, లిఫ్ట్చేయలేదట. ఆ తర్వాత విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్యకు ఫోన్ చేసినా స్పందించలేదట. దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు నేత ఏకంగా మంత్రి వాకిటి శ్రీహరికి ఫోన్‌చేయగా ఆయన కూడా స్పందించలేదట. ఆ తర్వాత మంత్రి పీఏకు ఫోన్‌చేసినా ఫలితం లేదట. ఇదంతా అభ్యర్థుల ముందే జరిగింది. మరింత కోపగించుకున్న సదరు నేత ఘాటు వ్యాఖ్యలు చేశారట. ‘ఏదైనా ఉంటే సీఎంనే కలవండి.. కలవకపోతే మరేదైనా చేయండి’ అని చెప్పి.. కోపంగా వెళ్లిపోయారట. కీలక పదవి ఇచ్చినా.. తన మాటకు విలువ లేదని.. సదరు నేత బాధపడుతున్నట్టు చర్చ జరుగుతున్నది.