హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ టూర్ల కోసం రూ.150 కోట్ల విలువ చేసే చార్టెర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేయాలని రేవంత్రెడ్డి సర్కారు నిర్ణయించి నట్టు తెలిసింది. హైదరాబాద్ నుంచి వారానికి మూడు నాలుగుసార్లు హస్తినకు చక్కర్ల కొడుతున్న రేవంత్రెడ్డి.. ప్రత్యేక విమానం కొనాలని యోచిస్తున్నట్టు సమాచారం. కమర్షియల్ విమానాల్లో వెళితే ఆలస్యమవుతున్నదని ప్రభుత్వ తరఫున చార్టెర్డ్ ఫ్లైట్ కొనడానికి రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. విమానం ఎలా ఉండాలి? ఎటువంటి ఫ్లైట్ కొనుగోలు చేయాలి? అనే అంశం మీద అధికారులతో ప్రత్యేక కమిటీ వేసినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అధికారం చేపట్టిన ఈ 17 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 44 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు. ఓ వైపు నన్ను కోసినా రూపాయి రాదంటూనే సీఎం రేవంత్రెడ్డి రూ.150 కోట్ల ప్రజాధనం దుబారా చేయడంపై ఆర్థిక నిఫుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.