Telangana | హైదరాబాద్, మార్చి 11(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లోగోను మార్చేసిందా? మంగళవారం విద్యాశాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన చూసిన వారికి ఇదే అనుమానం కలుగుతున్నది. జూనియర్ లెక్చరర్లుగా ఎంపికైన వారికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం విద్యాశాఖ ఒక ప్రత్యేక నోట్ విడుదల చేసింది.
ఈ నోట్‌పై రాష్ట్ర అధికారిక లోగో మారిపోయింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వ లోగోను ఉద్దేశపూర్వకంగానే మార్చారా? లేదా పొరపాటున మారిందా? అనే చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో అధికారిక లోగో మార్చాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పలు డిజైన్లను పరిశీలించింది. లోగో నుంచి కాకతీయ కళాతోరణం వంటి వాటిని తొలగిస్తారనే ప్రచారం జరగడంతో తీవ్ర విమర్శలొచ్చాయి. దీంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ప్రెస్‌నోట్‌లో కొత్త లోగో కనిపించడంపై మరోసారి చర్చ మొదలైంది. ఇందులో కాకతీయ కళాతోరణానికి బదులు అమరవీరుల స్తూపం కనిపిస్తున్నది.