CM Chandrababu | హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగా ణ): తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలో నే మొదటిస్థానంలో ఉన్నదని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. పెద్ద రాష్ర్టాలైన గుజరాత్, మహా రాష్ట్ర, కర్ణాటక కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్నదని వివరించారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కొనసాగించాయని, ఇందుకు ఆ పార్టీలను అభినందిస్తున్నానని చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆదివారం ఆయన తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ తలసరి ఆదా యం రూ.3 లక్షలు ఉంటే, ఏపీ తలసరి ఆదా యం రూ.2 లక్షలుగా ఉన్నదని చెప్పారు.
తలసరి ఆదాయం రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి, తెలంగాణకు మధ్య 35% వ్యత్యాసం ఉండేదని, ఇప్పుడు 44 శాతానికి పెరిగిందని వివరించారు. తన హయాంలోనే ఔటర్ రింగురోడ్డు, ఎయిర్‌పోర్ట్‌లను ప్రతిపాదన చేసి ప్రారంభించామని తెలిపారు. నేడు నాలెడ్జ్ ఎకానమీకి హైదరాబాద్ చిరునామాగా మారిందని పేర్కొన్నారు. తన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ అభివృద్ధి ని కొనసాగించాయని చెప్పారు. రెండు రాష్ట్రా ల మధ్య ఉన్న సమస్యలు పరిషరించుకుందామని తానే రేవంత్‌రెడ్డికి లేఖ రాశానని చెప్పారు. తెలుగు రాష్ర్టాల ప్రజలు కలిసి ముం దుకెళ్లాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాలు గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావని, సమస్యలు పరిషారం కావని, అభివృద్ధి జరగదని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కండ్లు అని వ్యాఖ్యానించారు. దేశానికి దశ దిశను చూపిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావును గుర్తుచేసుకున్న చంద్రబాబు.. ఆర్థిక సంసరణలు అమలు, సంపద సృష్టి ఆయన కాలంలోనే ప్రారంభమైందని చెప్పారు.
టీడీపీకి తెలంగాణలో మళ్లీ పూర్వ వైభవం తెస్తామని చంద్రబాబు చెప్పారు. తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగుదేశం జెండా ఈ ప్రాంతంపై రెపరెపలాడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ తనకు రెండు కండ్లు లాంటివని పేర్కొన్నారు. రెండు ప్రాంతాల ప్రయోజనాలే లక్ష్యంగా టీడీపీ పని చేస్తుందని హామీ ఇచ్చారు. తెలుగుజాతి ఐకమత్యంగా ఉండాలనే ఆలోచించానని, చివరి రక్తం బొట్టు వరకూ తెలుగుజాతి కోసం పనిచేస్తానని చెప్పారు. తనతోపాటు నాయకులను అనేక ఇబ్బందులు పెట్టినా తిరుగులేని శక్తిగా ఎదిగామని, తనను జైల్లో పెట్టినప్పుడు హైదరాబాద్‌లో టీడీపీ కార్యకర్తలు చూపించిన సంఘీభావం మర్చిపోలేనని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో తొమ్మిదిన్నరేండ్లు ముఖ్యమంత్రిగా చేశానని, తన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరని చెప్పారు. వచ్చే 30 ఏండ్లలో తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంటాయో ఇప్పుడే ఒక విజన్ ఆలోచిస్తానని తెలిపారు.
చంద్రబాబు ‘జై తెలంగాణ’ అని నినదించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రసంగం అనంతరం ‘జై హింద్.. జై తెలుగుదేశం.. జై తెలంగాణ’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఉద్యమ సమయంలో అడుగడుగునా రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడంతోపాటు తన హయాంలో తెలంగాణ పదాన్నే నిషేధించిన బాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తొలిసారిగా ‘జై తెలంగాణ’ నినాదం చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలనుకున్న బాబు పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నమ్మకం కల్గించేందుకే ఈ నినాదం చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.