Monsoon | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయని, తిరుపతి జిల్లా శ్రీహరికోట సహా సమీప ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ఉత్తర కొన శ్రీహరికోట, కర్ణాటక, తమిళనాడులోని ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్ తదితర ప్రాంతాలపై ఉన్నట్టు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్టుమెంట్ (ఐఎండీ) తెలిపింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి పవనాలు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నట్టు పేర్కొన్నది.
నైరుతి ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జాయ్ తుపాను రానున్న 24 గంటల్లో ఉగ్రరూపం దాల్చనున్నట్టు ఐఎండీ వెల్లచింది.