మహబూబ్ నగర్: బీఆర్ఎస్ ( BRS) ప్రభుత్వ పాలనను ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud ) అన్నారు. బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో పార్టీ రజతోత్సవ సభ పోస్టర్ను( Silver Jublee Poster ) విడుదల చేశారు. అనంతరం షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి వాల్ రైటింగ్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటైన పార్టీ అని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పదేళ్లు రాష్ట్రం సర్వోతోముఖాభివృద్ధి జరిగిందన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలోనే కేసీఆర్ తెలంగాణ సాధించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యిందని ఆరోపించారు.
ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యలపైన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని, ప్రభుత్వాన్ని నిలదీస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 27 న వరంగల్ లో జరిగే రజతోత్సవ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపు ఇచ్చారు. షాద్ నగర్ మాజీ శాసన సభ్యులు అంజయ్య యాదవ్ మాట్లాడుతూ రాజకీయంగానే తెలంగాణ వస్తుందనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ పెట్టి గాంధేయ పద్దతిలో కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణను సాధించారని వెల్లడించారు.
కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గణేష్, మహబూబ్ నగర్ మండల అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు సాయిలు యాదవు, గిరిధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నవకాంత్, శ్రీకాంత్ రెడ్డి, శరత్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.